calender_icon.png 14 September, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవరే సూత్రధారి

14-09-2025 01:10:05 AM

  1. రూ.40 లక్షల దారి దోపిడీ కేసును చేధించిన పోలీసులు
  2.   24 గంటల్లో ఏడుగురు నిందితుల అరెస్ట్
  3. ప్లాన్ ప్రకారమే రెక్కీ నిర్వహించి, కారుతో ఢీకొట్టి దోపిడీ

చేవెళ్ల, సెప్టెంబర్ 13: శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో జరిగిన దారి దోపిడీ కేసులో కారు డ్రైవరే సూత్రధారి అని పోలీసులు తేల్చారు. శనివారం సీపీ అవినాశ్ మహంతి కేసు వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన కాసుల మధు(27) క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్. ఇతను హైదరాబాద్‌కు చెందిన స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న సాయిబాబాకు ఏడాది కింద పరిచయం అయ్యాడు.

సాయిబాబాకు నమ్మకం కుదరడంతో గత మూడు నెలలుగా కష్టమర్లకు వస్తువులు పంపాలన్న, డబ్బులు తీసుకురావాలన్నా ఇతని కారును అద్దెకు వాడుకున్నాడు. శుక్రవారం రాకేశ్ అగర్వాల్ వికారాబాద్‌కు చెందిన కస్టమర్ అన్సారీ దగ్గర రూ.40 లక్షలు తీసుకురావాలని తన మేనేజర్ సాయిబాబాకు చెప్పాడు. దీంతో సాయిబాబా ఒక రోజు ముందుగానే మధు కారును బుక్ చేశాడు. అయితే గతంలోనూ సాయిబాబా ఎక్కువగా డబ్బులు తీసుకెళ్లడం గమనించిన మధు ఎలాగైనా కాజేయాలని ప్లాన్ వేశాడు.

ఇందులో భాగంగా తన పాత స్నేహితులైన ఆర్సీపురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విజయ్ కుమార్ (35), కాచీగూడకు చెందిన కారు డ్రైవర్ మహమ్మద్ అజర్(44)కు సమాచారం ఇచ్చాడు. విజయ్ గచ్చిబౌలికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సాలిని హర్షవర్ధన్ (26) అనే మరో వ్యక్తికి ఈ టాస్క్‌లో కలుపుకున్నాడు. ఈ నలుగురు కలిసి 11న గురువారం వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డును రెక్కీ చేసి జన సంచారం తక్కువగా ఉన్న హుస్సేన్‌పూర్ గేటు వద్ద దోపిడీ చేయాలని నిర్ణయించారు.

తర్వాత హర్ష తన పాత స్నేహితుడైన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుల్కచర్లకు చెందిన కారు డ్రైవర్ బండ్ర అనుదీప్ అలియాస్ అడ్డూ(25) కారు తీసుకున్నాడు. అంతేకాదు ఈ ముఠాలో ఇద్దరు బౌన్సర్లు చార్మినార్ పరిధిలోని దూద్ బౌలికి చెందిన షమీం ఉల్లా(26), మియాపూర్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేటకు చెంది న చెరుకుల దీపక్ (25) ను చేర్చుకున్నారు.

ఎస్కార్ట్‌గా మరో కారు పెట్టి..

12న ఉదయం 11.30 గంటల సమయంలో సాయిబాబా వికారాబాద్ చేరుకొని కస్టమర్ అన్సారీ నుంచి రూ.40 లక్షలు తీసుకొని మధు కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. వీరిని హర్ష, షమీం ఉల్లా, దీపక్, అనుదీప్ స్విప్ట్ కారులో వెంబడించారు. విజయ్, అజర్ మరో కారును వీరికి ఎస్కార్ట్ కమ్ బ్యాకప్‌గా ఉపయోగించారు. డ్రైవర్ మధు విజయ్ లొకేషన్, సాయిబాబా కడలికలను షేర్ చేస్తూ రాగా.. విజయ్ ఆ వివరాలను హర్షకు అందించాడు.

ప్లాన్‌లో భాగంగా హుస్సేన్‌పూర్ పరిధిలోకి రాగానే వార్ష ప్లార్కింగ్ లైట్స్ బ్లింక్ చేసి సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మధు వాహనాన్ని నెమ్మదించాడు. వెంటనే హర్ష వారికి కారును ఓవర్ టేక్ చేసి ఢీకొట్టి.. సాయిబాబాను కత్తి, బొమ్మ తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్నాడు.

మధు కూడా సాయిబాబా ముందు నటిస్తూ నిందితులకు సహకరించాడు. వారు డబ్బులు తీసుకొని ముందు వెళ్తుండగా.. విజయ్, అజయ్ వారిని అనుసరించారు. కానీ, నిందితుల కారు అనూ హ్యంగా ఫల్టీ కొట్టడంతో కథ అడ్డం తిరిగింది. కారును వదిలేసి విజయ్, అజర్ ఉన్న కారులో హైదరాబాద్ పారిపోయారు.

24 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు

శంకర్ పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని కీలక ఆధారాలు సేకరించారు. వెంటనే సీపీ అవినాశ్ మహంతి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ డీసీపీ సీహె శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి స్థానిక, ఎస్వీటీ, సీసీఎస్ పోలీసులతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్, సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.

ముందు ప్రమాదం జరిగిన కారు యజమాని అయిన అనుదీపన్‌ను పోలీసుల సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారు. తదుపరి విచారణలో భాగంగా సంగారెడ్డి, షాద్‌నగర్ పోలీసులు అప్రమత్తమై ముంబై హైవేపై జహీరాబాద్, బెంగళూరు హైవేపై రాయికల్ టోల్ ప్లాజాలో వాహన తనీఖీలు చేపట్టి మిగితా నిందితులను పట్టుకున్నారు.

నిందితుల నుంచి కత్తులు, బొమ్మ తుపాకీ, సెల్ ఫోన్లను సీజ్ చేయడంతో పాటు రూ.17,50,000 రికవరీ చేశారు. నిందితుల్లో విజయ్‌పై పోర్జరీ, కూకట్‌పల్లిలో ఎన్టీపీఎస్ కేసు, అజర్‌పై మేడ్చల్, చిలకలగూడ, పేట్ బషీరబాద్ పోలీస్ స్టేషన్లలో 3 చోరీ కేసులు, హర్షవద్ధన్‌పై 5 చీటింగ్ కేసులు, షమీం ఉల్లాపై ఒక దోపిడీ కేసు ఉన్నట్లు సీపీ వెల్లడించారు.