14-09-2025 01:47:56 AM
మహిళా సాధికరత దిశగా అడుగులు: సీఎండీ బలరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సింగరేణిలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లుగా, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం మరో సువర్ణావకాశం కల్పించింది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేయడానికి వీరి నుంచి దరఖాస్తులను ఆహ్వానించడంతో సింగరేణిలో మహిళా సాధికారత దిశగా మరో అడుగు వేసినట్టయింది. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశాలతో..
జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళల నుంచి ఈ దరఖాస్తులు ఆహ్వానించారు. మైనింగ్ రంగంలో మహిళా సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరులను సమర్థంగా వినియోగించడంలో భాగంగా సీఎండీ బలరాం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సింగరేణి యాజమాన్యం అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళలకు భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 35 ఏండ్లలోపు వయస్సు, కనీసం ఏడో తరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు. అలాగే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని యాజమాన్యం పేర్కొంది.
దరఖాస్తులను జీఎం సీపీపీ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థ హెవీ గూడ్స్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ విభాగంలో శిక్షణ ఇస్తారు.