22-10-2025 12:00:00 AM
నిజామాబాద్ అక్టోబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ను నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ మంగళవారం కలిశారు. హైదరాబాద్ లోని నల్లకుంటలోగల జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయనను కలిసి, నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ పక్షాన సన్మానించడం జరిగింది.
ఈ నెల 18న నిర్వహించిన తెలంగాణ బంద్ విజయవంతం విషయమై సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. భవిష్యత్తులో చేపట్టబోయే బీసీ ఉద్యమ కార్యాచరణను వివరించారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం కోసం జరుగుతున్న రిజర్వేషన్ల పోరాటంలో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని, అఖిలపక్ష పార్టీల, ప్రజా, బీసీ, కుల, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు బీసీ బంద్ లో పాల్గొన్నారని, రాష్టానికి మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు. నిజామాబాద్ బీసీ జేఏసీ కార్యాచరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణయ్య, రాబోయే ఉద్యమ రోజుల్లో నిజామాబాద్ వస్తానని, అక్కడే నిరసనల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కార్యదర్శి సుభాష్ పద్మ, నాయకులు పాల్గొన్నారు.