22-10-2025 12:00:00 AM
నిజామాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
బోధన్ మండలం పెగడాపల్లి, సాలురా మండలం సాలంపాడ్ క్యాంప్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు.
పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరి పంట సాగు చేశారా లేదా అన్నది వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ధృవీకరణ పత్రం అందించాలని కలెక్టర్ ఆదేశించారు., వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయించాలన్నారు.
మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని, సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ ను ఆదేశించారు. గత సీజన్‌లో 600 కేంద్రాలు ఉండగా, ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పు తున్నామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, తహసీల్దార్ విఠల్, ఏ.ఓ సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.