14-07-2025 04:38:12 PM
10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ప్రత్యక్షంగా పోటీ..
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరపరాజు రాంచందర్ రావు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ ఉమ్మడి జిల్లా రాజకీయ చైతన్యం కలిగిందని ఇక్కడ కూడా కుటుంబ పాలన నడుస్తోందని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలంటే భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరపరాజు రాంచందర్(Telangana State President Ramchander Rao) అన్నారు. నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నేను నా సొంత జిల్లా అయిన నల్గొండలో పర్యటిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం వస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంపిక చేస్తున్న లబ్ధిదారులపై అనేక ఆరోపణలు ఉన్నాయని రేషన్ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు.
రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికే కృతజ్ఞత చెప్పకుండా దాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందని మండిపడ్డారు. గతంలో రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీలో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మలు ఉండేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని తొలగించడం సరికాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం మతపరమైన కోటా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు కూడా రిజర్వేషన్లను నిరాకరించిందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ వర్గాలు దీనిపై గమనించి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పనులు ఎందుకు నిలిచిపోయాయో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వారిదే నన్నారు.భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి వరకు ప్రత్యక్షంగా పోటీ చేస్తుందని తెలిపారు. గతంలో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయలేదని కానీ ఈసారి బలంగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గొంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి, చింత సాంబమూర్తి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.