calender_icon.png 2 August, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ ఉద్యమ భూమిక బీసీఐఎఫ్

30-07-2025 12:00:00 AM

‘ఇస్సా, ఇజ్జత్, హుకుమత్’ ఉద్యమ నినాదంతో బీసీల వాటా ఉద్యమానికి బాటలు వేస్తూ, బీసీ ఆత్మ గౌరవ పథకాన్ని రెపరెపలాడిస్తూ, బీసీ రాజ్యాధికాతర భావజాల వ్యాప్తికి పునాదులు నిర్మిస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం (బీసీఐఎఫ్) ఈనెల 30వ తేదీతో ఏడాది పూర్తి చేసుకున్నది. ఫోరం ఆవిర్భావం వెనుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్రియాశీలకంగా వ్యవహరించారు.

ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ తిరుమలి, చామకూర రాజు, కేవీ గౌడ్, చెన్న శ్రీకాంత్, పర్వతం వెంకటేశ్వర్లు, సంగం సూర్యారావు కృషి ఎనలేనిది. ఫోరం మొదటి సదస్సు 2024 జూలై 30న తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగింది. సదస్సులో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చ సాగింది. సదస్సుకు బీసీ సంఘాల నేతలు, మేధావులు ప్రాతినిధ్యం వహించారు. ఈ పయనంలో ఫోరం బీసీ ఉద్యమా స్వరూపాన్ని మార్చి, రాజ్యాధికారం దిశాగా నిర్దేశం చేస్తూ గుణాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసింది. 

న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు..

రాష్ట్రంలో 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నో హామీలు గుప్పించింది. వాటిలో కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎంబీసీ మంత్రిత్వశాఖ తదితర హామీలు ఉన్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్నది. బీసీల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు ఫోరం పోరాటానికి సిద్ధమైంది.

రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ను భుజానికి ఎత్తుకున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం గతేడాది నవంబర్ 7న కులగణన ప్రారంభించింది. ఈప్రక్రియను ఇదే నెల 30న పూర్తి చేసింది. కులగణన వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 2న అసెంబ్లీలో ప్రకటించారు.

గణాంకాల్లో లోపాలను గుర్తించిన బీసీఐఎఫ్ ఆ మరుసటి రోజే మీడియా సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన రాష్ట్రంలో బీసీల సంఖ్యను తక్కువగా చేసి చూపించిందని, కొన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వివరాలు సేకరించలేకపోయారనే అంశాన్ని ప్రజలకు వివరించింది. మాతో పాటు కొన్ని సంఘాలు కూడా ఇవే విమర్శలు చేశాయి. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి మరో పదిరోజులు వెచ్చించి కులగణన చేపట్టింది. తద్వారా అంతకముందు కేంట బీసీల సంఖ్య 0.3 శాతం శాతం పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి..

కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో గతేడాది డిసెంబర్ 11న ఫోరం జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. ఇదే నెల 12న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. ధర్నాకు ఢిల్లీలోని వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు హాజరయ్యారు. తర్వాత ఫోరం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పైనా పోరాడింది. జీవో 29 రద్దు చేయాలని కోరుతూ 30కిపైగా బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది.

జీవో రద్దు కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతిపత్రం అందించింది. అలాగే ఎంఎస్‌ఎంఈ పాలసీలో బీసీలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్రప్రభుత్వం ఒక అడ్వుజరీ కమిటీని నియమించింది. ఫోరం బీసీ బిల్లుల ఆమోదం, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి తొమ్మిదో షెడ్యూల్ మాత్రమే రక్షణ అనే నినాదంతో సదస్సు నిర్వహించింది.

రాజ్యాంగ నిపుణుడు, సుప్రీం కోర్ట్ న్యాయవాది విల్సన్, జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తదితరులతో అవగాహన సదస్సు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం వద్ద 42శాతం రిజర్వేషన్ అంశం పెండింగ్‌లో ఉండగా రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలు వల్ల నష్టం వాటిల్లుతుందని, కోర్టులో ఆర్డినెన్స్ నిలబడదన్న వాదనను ఫోరం స్పష్టం చేసింది.  దీంతో రాష్ట్రప్రభుత్వం తిరిగి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది.

భావజాల వ్యాప్తి కోసం..

పరిణామ క్రమంలో పదునెక్కిన ఆలోచన ఆయుధమవుతుంది. దోపిడీ శక్తుల్ని కూల్చే సిద్ధాంతమే ఒక ఆయుధం అవుతుంది’ అంటాడు కవి అలిశెట్టిప్రభాకర్. ఆ తీరున బీసీ ఉద్యమానికి ఒక ఆయుధంగా ‘ఇస్సా, ఇజ్జత్, హుకుమత్’ అనే నినాదంతో ఫోరానికి సిద్ధాంత భూమిక రూపొందించాం. ఫోరం చైర్మన్‌గా నేను, కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్, కిరణ్‌కుమార్, చెన్న శ్రీకాంత్, అవ్వారు వేణు తదితరులు బీసీల వెనుకబాటుపై అధ్యయనం చేస్తున్నాం.

ఎప్పటికప్పుడు వాటిని వ్యాసాల రూపంలో పత్రికలకు అందిస్తున్నాం. అలాగే ‘సామాజిక న్యాయమే బీసీ వాదం.. బీసీ నాదం’ పేరుతో ఇప్పటికే రెండు పుస్తకాలు ప్రచురించాం. త్వరలో మూడో పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. మున్ముందు మరిన్ని ప్రచురిస్తాం.

రచయిత: బీసీ మేధావుల ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్