30-07-2025 12:00:00 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటున్న గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.. నాణ్యమైన విద్య అందిస్తాం.. పక్కాగా ఆహార మెనూ అమలు చేస్తాం.. అని రాష్ట్రప్రభుత్వం హామీలు ఇస్తుంది. కాని అవి ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు రాష్ట్రంలో తరచుగా చోటుచేసుకోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గత ఏడాది అక్టోబర్ 30న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకులంలో కలుషిత ఆహారం తిని 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారింది. వీరిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా, 21 రోజులు మృత్యువుతో పోరాడి శైలజ అనే విద్యార్థిని మృతిచెందింది. మిగతా ఇద్దరు విద్యార్థినులు అతి కష్టంమీద కోలుకున్నారు.
గత నవంబర్ నెలలో తిరిగి నాగర్‌కర్నూల్ జిల్లా మాగనూర్ జడ్పీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 21 మంది, ఈ ఏడాది జనవరి 28న రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ కందకూరు గురుకులంలో కలుషిత ఆహారం తిని 84 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలు మరువక ముందే ఈనెల 26న నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ గురుకులంలో కలుషిత ఆహారం తిని 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఇలా రాష్ట్రంలో తరచూ ఏదో ఒకచోట ఫుడ్ పాయిజన్ ఘటనలు సంభవిస్తున్నాయి. సాధారణంగా గురుకులాలు, వసతి గృహాలకు ఆహారం లేదా ముడిసరుకులు, కూరగాయలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరఫరా చేస్తాయి. ప్రభుత్వ బడుల్లోనైతే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) నిర్వర్తిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఏజెన్సీలు, ఎస్‌హెచ్‌జీలకు నెల నెలా సక్రమంగా బిల్లులు విడుదల కాకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి, లేదంటే అప్పో సప్పో చేసి విద్యార్థులకు ఆహారం అందేలా చూస్తున్నారు. నాణ్యతలేని ఆహారాన్ని, సరుకులు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
తర్వాత ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైతే, కాంట్రాక్ట్ ఏజెన్సీలపై గురుకులాలు, వసతి గృహాలకు సరైన అహారమందించడం లేదంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. సకాలంలో బిల్లులు రాకపోడంతో తాము నాణ్యమైన ఆహారం అందించడం లేదంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీలు చెపుతున్నాయి. ఇలా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం పరిపాటి అయింది.
వాంకిడి ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థిని శైలజ ప్రాణాలు కోల్పోయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌ను నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్ పనితీరు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగలడంతో తిరిగి రాష్ట్రంలో ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సాధికారితకు కట్టుబడి ఉంటున్నామంటున్న సర్కార్..
ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యసంరక్షణపైనా దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు కూడా ఫుడ్‌పాయిజన్ ఘటనలు సంభవించినప్పుడు మాత్రమే గురుకులాలను, హాస్టళ్లను సందర్శించే విధానాన్ని మార్చుకుని, వాటిని నిత్యం సందర్శిస్తూ మానిటరింగ్ చేయాలి. అక్కడి లోటుపాట్లను ఎత్తిచూపుతూ, సర్కార్ ఆ సమస్యలకు పరిష్కారం చూపేలా చొరవ తీసుకోవాలి.