calender_icon.png 11 December, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు సంఘటితం కావాలి

10-12-2025 09:07:14 PM

బీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ పిలుపు..

హనుమకొండ (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు జరుగుతున్న ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేసిన బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చాటాలని ఓబీసీ చైర్మన్, వరంగల్ కూడా మాజీ చైర్మన్  సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని తుంగలోతొక్కిన ముఖ్యమంత్రి గతంలో ఉన్న 23 శాతాన్ని కూడ 17 శాతానికి తగ్గించి, ఎన్నికలు నిర్వహిస్తుండడం బీసీ సమాజానికి ద్రోహం చేయడమేనన్నారు. శాసనసభలో చేసిన బిల్లులను పార్లమెంట్లో చర్చకు పెట్టించి పాస్ చేయించండంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.

బీసీనని పదేపదే చెప్పుకునే ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించకుండా బీసీలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితిలో పార్టీపరంగా 42 శాతం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా బీసీలను మోసం చేశాయని, ఈ పరిస్థితుల్లో జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి తమ సత్తా చాటాలని, బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపునుసరించి పోటీ చేస్తున్నవారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో రాజకీయాలకతీతంగా బీసీ లందరూ చైతన్యంతో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీసీల అభ్యర్థులకు సహకరించి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న కాలంలో బీసీ రిజర్వేషన్ల సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.