10-12-2025 09:45:46 PM
వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ
నూతనకల్: మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో జరిగిన ఉప్పుల మల్లయ్య హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఉప్పుల సతీష్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీష్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్య ఉన్నట్లు బుధవారం నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
గ్రామంలో వర్గ విభేదాల కారణంగా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఘర్షణ జరిగిందని, ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయని తెలిపారు.ఈ దాడిలో ఉప్పుల మల్లయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే దాడికి పాల్పడిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కర్రలు, రాళ్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును త్వరగా ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, తుంగతుర్తి సీఐ ఎ. నరసింహారావు, ఎస్సై ఆర్. నాగరాజు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అభినందించారు.