28-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసి, బీసీల వాటాను ఉన్నతవర్గాలకు మళ్లిస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించా రు. రిజర్వషేన్ల సాధనకై ఈ నెల 30న బీసీల చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభను బీసీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం లక్డికాపూల్ లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా కూడా ఇవ్వకుండా బీసీలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పి పది రోజులు గడిచాయని, సర్పంచ్ నామినేషన్లు ప్రారంభమైనా పార్టీ నుంచి అధికార ప్రకటన వెలువడకపోవడం చాలా దారుణమన్నారు.
బీసీలకు రావలసిన వాటాను గండి కొట్టి వాటిని ఉన్నతవర్గాలకు అప్పగించడం కోసం చేసిన నిర్ణయంగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ర్టమంతా బీసీలు రిజర్వేషన్ల కోసం రోడ్లమీదకి వస్తుంటే సచివాలయంలో మంత్రులు ఏసీ రూములలో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. బీసీల మద్దతుతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి, బీసీ బిడ్డను గెలిపించడం ద్వారా రాష్ర్టంలో రెండు కోట్ల మంది బీసీలను రాజకీయంగా బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాయని వాపోయారు.
రిజర్వేషన్లు సాధించేదాకా బీసీ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని, బీసీ రిజర్వేషన్లు కావాలని కోరుకునే ప్రతి బీసీ ఉద్యమకారుడు ఈ నెల 30న జరిగే చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ ఎన్నికలు నిలిపివేసి, అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో పోరాడడానికి సిద్ధం కావాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్‌గాంధీవి మాటలు తప్ప ఆచరణలో లేవన్నారు.
ఢిల్లీలో రెండు సార్లు ధర్నా చేసిన రాహుల్ గాంధీ హాజరు కాలేదు, కనీసం పార్లమెంటులో మాట్లాడలేదన్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో స్తంభింపజేస్తే బీసీ సమాజం హర్షిస్తుందని, లేదంటే బీసీల యుద్ధం కాంగ్రెస్ పైనే ఉంటుందని స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌దే: మంద కృష్ణ
బీసీలకు నమ్మకద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయ క్రీడలను ఆపిచ బీసీ బిల్లు ఆమోదించడానికి కృషి చేయాలన్నారు. 30న బీసీ చలో హైదరాబాద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఇచ్చిన హామీని గాలికి వదిలేసి.. కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసిందన్నారు.
కుల గణన చేయడం, 52 శాతం తేల్చడం, క్యాబినెట్‌లో నిర్ణయం చేయడమే కాదు రిజర్వేషన్లు అమలు జరిగేవరకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇంతకాలం ఆగి ఇప్పుడు ఇంత తక్కువ శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయం పేర్కొన్నారు. గతంలో 23 శాతం ఇచ్చినదాన్ని పెంచకుండా 17 శాతానికి తగ్గించడమేంటని ప్రశ్నించారు. 5 వేలకు పైగా రావాల్సిన సర్పంచ్ స్థానాలు 2 వేలు కూడా బీసీలకు రాలేదన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేని రాహుల్‌గాంధీ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తాడని ప్రశ్నించారు. పార్టీ గుర్తు లేని చోట 42 శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఈ దశాబ్దాపూ జోకుగా చూడాలన్నారు. కోర్టు తీర్పు వచ్చేదాకా కూడా ఆగకుండా తొందరపడి నమ్మక ద్రోహం కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు. బీజేపీ కూడా పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించే బాధ్యత తీసుకోవాలని కోరారు.