04-09-2025 01:47:40 AM
మీ చుట్టూ కుట్ర జరుగుతోంది
ఏ పార్టీలోనూ చేరను.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ‘నేను, నాన్న, అన్న కలిసి ఉండటం చాలా మందికి ఇష్టం లేదు. అందుకే ముం దుగా నన్ను బయటకు పంపారు. అది ఇక్కడితో ఆగదు. నాన్నా.. మీ చుట్టూ ఏం జరు గుతుందో ఓసారి చూసుకోండి. రేపటిరోజు ఇదే ప్రమాదం రామన్న(కేటీఆర్)కు, మీకూ పొంచి ఉంది. బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకొనే కుట్రలో భాగంగానే నన్ను బయటకు పంపారు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొం దాలనుకొనే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్‌రావు, మాజీఎంపీ సంతోష్‌ను ఉద్ధేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెం డ్ చేసిన నేపథ్యంలో కవిత బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు.
‘నేను రామన్నను బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పా. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా? నాకే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు ఏం న్యాయం జరుగుతుంది. హరీశ్‌రావు, సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్‌కు బిడ్డగా చెబుతున్నా. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచీ హరీశ్‌రావు లేరు.
పార్టీ పెట్టిన 10 నెలల తర్వాత వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి, హరీశ్‌రావు ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ను గమనించుకో రామన్న (కేటీఆర్). సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారా? లేదా? చెప్పాలి. సంతోష్, హరీశ్‌రావు గ్యాంగ్‌లు బీఆర్‌ఎస్‌కు పట్టిన జలగలు. వాళ్లిద్దరూ మా మంచి కోరేవారు కాదు. హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్‌కు సీబీఐ మరక అంటింద’ని ఆరోపించారు.
‘గతంలో పార్టీకి ఒక్క క్షణం చెడ్డపేరు రాగానే హరీశ్‌రావు వెళ్లి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలవలేదా? ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో మాట్లాడి రెండో అభ్యర్థిని పెట్టాలని హరీశ్ రావు ప్రతిపాదించారు. ఓ బీజేపీ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి చెబితే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. హరీశ్‌రావు ట్రబుల్ క్రియేట్ చేసి.. పరిష్కరించినట్టు నటిస్తారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు విడిగా డబ్బులు ఇచ్చారు.
ఆ డబ్బు కాళేశ్వరం అవినీతిది కాదా? 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు డబ్బు పంపారు. 2007 నుంచి నేను రోడ్డుపైనే ఉన్నా. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడాలని కేటీఆర్‌ను కోరుతున్నా. ఆరడుగుల బుల్లెట్ ఇవాళ నన్ను గాయపరిచింది.. రేపు ఎవరిని గాయపరుస్తుందో.. హరీశ్‌రావు కారణంగానే ఈటల రాజేందర్, జగ్గారెడ్డి మొదలైన వారు బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమికి ఆయనే కారణం’ అని తెలిపారు.
‘నేరేళ్ల’ నిందితుడు సంతోష్‌రావే..
‘కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కుట్ర పన్నారు. మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సంతోష్ బాధితులు ఉన్నారు. బీఆర్‌ఎస్ సాఫ్ట్‌వేర్ అయితే.. తెలంగాణ జాగృతి హార్డ్‌వేర్. పార్టీకి నా కంట్రిబ్యూషన్ లేదా?, కేవలం హరీశ్‌రావు, సంతోష్ మాత్రమే ఉందా? మేకవన్నె పులులను పార్టీలో ఉంచుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేను. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి.
కేటీఆర్‌కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. హరీశ్‌రావు, సంతోష్, శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. నేను ఏ పార్టీలోనూ చేరను. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’ అని కవిత పేర్కొన్నారు. తాను కేసీఆర్‌కు రాసిన లేఖను సంతోష్‌రావే లీక్ చేశారని ఆరోపించారు. పార్టీ అధినేతకు వారి అవినీతి గురించి చెప్పానన్నారు. తన దగ్గర చాలా సమాచారం ఉందని, ఒక్కొక్కటిగా అన్ని బయటపెడతానని తెలిపారు.
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అవినీతిపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమాచారం ఇచ్చారని, జనగామ టికెట్‌పై ఇద్దరూ గొడవ పడ్డారని గుర్తు చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్ నేతలకు తెలుస్తోందని ఆరోపించారు. రాఖీ పండుగకు ముందు రోజే కేటీఆర్‌కు తాను వస్తానని మెజేస్ చేసినట్టు తెలిపారు. మీడియా లేకుండానే రాఖీ కట్టేందుకు వస్తానని చెప్పానన్నారు. కానీ రామన్న ఏదో బిజీగా ఉండి ఎక్కడికో వెళ్లారని, అది అర్థం చేసుకుని సైలెంట్‌గా ఉన్నానని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్‌తో తనది రక్త సంబంధం అని, పార్టీలు పోతేనో, పదవులు పోతేనో విడిపోయే బంధం కాదని చెప్పారు. సిరిసిల్లాలోని నేరెళ్లలో ఇసుక లారీ వల్ల ప్రమాదం జరిగితే ఏడుగురు యువకులను థర్డ్ డిగ్రీతో కాళ్లు, చేతులు లేవకుండా చేయించింది సంతోషేనని ఆరోపించారు. కానీ అపవాదు మాత్రం కేటీఆర్‌పై పడిందన్నారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్..
ఎమ్మెల్సీ కవిత తన రాజీనామా లేఖను బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఓఎస్డీకి అందజేశారు. అనంతరం సుఖేందర్‌రెడ్డికి కవిత ఫోన్ చేసి మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, గురువారం మరోసారి ఫోన్ మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. దీంతోపాటు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. లేఖను తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డికి జాగృతి నాయకులు అందజేశారు.
మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా..
బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత ట్విట్టర్‌లో స్పందించారు. నిజం మాట్లాడటానికి ఖర్చైతే, తెలంగాణ ప్రజల కోసం తాను వంద రేట్లు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.