04-09-2025 01:14:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ పేర్కొన్నారు. గతం కంటే ఈ సారి చాలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయంలో మేడారం మాస్టర్ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఎండోమెంట్ ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామాయ్యర్, ములుగు కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు అధికారులు మంత్రులకు వివరించారు. సమ్మక్క పూజారుల సూచనల మేరకు మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్‌ను మంత్రులు ప్రత్యేకంగా పరిశీలించారు. డిజైన్లలో చేయాల్సిన మార్పులపై మంత్రులు సూచనలు చేశారు.
భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. తగిన మేరకు డిజైన్లు మార్చాలన్నారు. భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని చెప్పారు.
మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు జరిగితే మేడారం జాతర మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్‌మెంట్ సరైన విధంగా ఉండేలా డిజైన్లు రూపకల్పన చేయాలన్నారు. ఫ్యూరిఫైడ్ వాటర్ అందించాలని మంత్రి సురేఖ సూచించారు. బెల్లం కింద పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి సలహానిచ్చారు.
సేవా పద్ధతిన భక్తులను మ్యాన్ పవర్ కింది వినియోగించుకోవాలన్నారు. జాతరకు వెళ్లే దారి ఇందిరా మహిళా క్యాంటీన్‌ల ద్వారా తినుబండారాలను అందేలా చూడాలన్నారు. అవసరమైతే అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలను వివిధ ప్రదేశాల్లో ఉపయోగించుకొని తగు సేవలు భక్తులకు అందజేయాలన్నారు. మాస్టర్ ప్లాన్‌లో మొత్తం రెండు దశలుగా స్థానికంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. మొత్తం రూ.236.2 కోట్లతో మాస్టర్ రూపొందించగా, -అందులో పలు అంశాలకు కేటాయింపులు చేశారు.
* గద్దెల అభివృద్ధికి రూ.58.2 కోట్లు
* గద్దెల వద్ద కళాకృతి పనులకు రూ.6.8 కోట్లు
* జంపన్న వాగు అభివృద్ధికి రూ.రూ39 కోట్లు.
* భక్తుల అకామిడేషన్ నిమిత్తం రూ.50 కోట్లు
* రోడ్ల అభివృద్ధి నిమిత్తం రూ.52.5 కోట్లు
* మిగతావి ఇతరత్రా ఖర్చుల నిమిత్తం