04-09-2025 01:30:13 AM
కరీంనగర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అవినీతి కవల పిల్లలు అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పి బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో బుధవారం జరిగిన కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి రాంచందర్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆ పార్టీ కి చెందిన కుటుంబ సభ్యులే, ఎమ్మెల్సీలే బయటపెడుతున్నారని చెప్పారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు తలెత్తడంతో ఈ విషయాలు చెపుతుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని, కానీ కాళేశ్వరం, ఎల్లంపల్లి వంటి ప్రాజె క్టుల నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు.
కవిత అంశంపై మాట్లాడుతూ తమ పార్టీ లో అవినీతి మరకలకు స్థానం లేదని స్పష్టం చేశా రు. కాగా 2028లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని పేర్కొన్నారు. రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులను ఇక్కడి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఎన్డీయే ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాలతో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని చెప్పారు.
కరీంనగర్ -జగిత్యాల జాతీ య రహదారి విస్తరణ దాదాపు 2 వేల కోట్లతో జరుగుతోందని, రాష్ర్టంలో రైల్వేలు, రోడ్లనిర్మాణా ల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు 73, 74 సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు అందిస్తోందని, గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు.
కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం రెండూ కేంద్రం ఏం ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి, జిల్లాకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ న్యాయం చేయలేదన్నారు. శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ క్లాసులు మూసేస్తే బండి సంజయ్ కుమార్ స్పందించారని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లా మినిస్టర్‌తో మాట్లాడి తిరిగి క్లాసులు ప్రారంభమయ్యేలా కృషి చేశారని గుర్తు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణం గా తయారయిందని విమర్శించారు. ప్రజల్లో మొహం చూపెట్టలేక పార్టీ నాయకులు కాకుండా రాష్ర్ట ఇన్‌చార్జిలతో పాదయాత్ర చేయాల్సి స్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని, కానీ తెలంగాణ పరిపాలనను గాలి కి వదిలేశారని దుయ్యబట్టారు. బీజేపీ మాత్రమే ప్రజల కోసం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభు త్వం అవినీతి, పాలనా లోపాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణలో మార్పు రావాలని, బీజేపీ అధికారంలో రావాలన్నారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ డబుల్ గేమ్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం స్కాం అని ఆరోపించారు. కేసీఆర్ బిడ్డ కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంగీకరించిందని చెప్పారు. కాళేశ్వరం విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. అసెంబ్లీలో సీబీఐ విచారణ చేయాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైకోర్టులో మాత్రం సరైన వాదనలు వినిపించకుండా బీఆర్‌ఎస్‌కు రిలీఫ్ వచ్చేలా చేశారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నేతలు చేసిన స్కాంల విషయంలో ఎడతెరిపిలేని విచారణలతో జాప్యం చేస్తూ దోషులు తప్పించుకునేలా చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై నివేదిక వచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అంశంతోపాటు ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, గొర్రెల స్కాం కేసులను సీబీఐ విచారణకు రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయ డం లేదని ప్రశ్నించారు.
నక్సలిజం ఫిలాసఫీ అని రేవంత్‌రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి దానికి అనుకూలంగా మాట్లాడటం విడ్డూరమన్నారు. నక్సలైట్ల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉన్నదని, వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని అంతమొందించి తీరుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు సరైన లీగల్ టీం లేదు కాబట్టే అన్నింట్లోనూ ఫెయిలవుతున్నారని అన్నా రు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాంచందర్‌రావు నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ పేరెత్తితే జనం అసహ్యించుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీతో కుమ్కక్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించి రామచంద్రరావుకు అప్పగిస్తాన ని అన్నారు. బీజేపీ అభ్యర్థి ఎంపీటీసీగా గెలిపిస్తే ఆ గ్రామానికి రూ.5 లక్షలు, బీజేపీ అభ్యర్థిని జడ్పీటీసీగా గెలిపిస్తే ఆ మండలానికి రూ.10 లక్షలు ఇస్తానని తెలిపారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైసా ఇయ్యని ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
కేంద్ర నిధుల కోసమే స్థానిక సంస్థలు నిర్వహించాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమ స్యలపై అసెంబ్లీలో చర్చే లేదని, ఇండ్లు లేక జనం అల్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజల దారి మళ్లించేందుకు అసెంబ్లీలో కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
వరదల్లో కామారెడ్డి కొట్టుకుపోయిందని, అట్లాగే కాంగ్రెస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఆ వరదల్లోనే కొట్టుకుపోయిందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అవినీతి స్కాంలన్నింట్లోనూ బాధ్యలుపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్‌తో కాంగ్రెస్ పెద్దలు లాలూచీ పడటమేనని, అందుకే విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
దొంగలు దొరకకుం డా ఆధారాలు మాయం చేసే అవకాశం ఇస్తున్నారని, కోర్టుల్లో సరైన ఆధారాలు సమర్పించకుండా, గట్టిగా వాదనలు చేయకుండా కేసును వీక్ చేస్తూ దోషులను కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.