04-09-2025 02:07:48 AM
నాలుగు స్లాబుల జీఎస్టీ విధానం రెండు స్లాబులకు కుదింపు
-12, 28 శాతం స్లాబుల తొలగింపు
-5, 18 శాతం స్లాబులు కొనసాగింపు
-సవరించిన జీఎస్టీ కౌన్సిల్
-ఈనెల 22 నుంచి కొత్త విధానం అమలు
-వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
-తగ్గనున్న చెప్పులు, వస్త్రాల ధరల
-రెవెన్యూ నష్టంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆవేదన
-కొత్త స్లాబ్ జీఎస్టీ విధానాన్ని సమర్థించిన ఏపీ, అస్సాం
-ఎంఎస్‌ఎంఈలకు 3 రోజుల్లోనే రిజిస్ట్రేషన్
-33 రకాల ఔషధాలపై జీఎస్టీ తొలగింపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశవ్యాప్తంగా నాలుగు స్లాబ్‌లుగా ఉన్న జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబ్‌లకు కుదిస్తూ బుధవారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతంగా ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబులను, 5, 18 శాతం స్లాబ్‌లకు కుదించింది. కొత్త విధానాలు సామాన్యుడికి ఊరట కలిగించేలా కొత్త నిర్ణయాలున్నాయి. స్టేషనరీ వస్తువులు, పరాటాలు, చపాతీలు, రొట్టెలపై జీఎస్టీని రద్దు చేయడం పేద, మధ్య తరగతి ప్రజలను ఊరట నిచ్చే నిర్ణయం.
విలాస వస్తువులైన పాన్‌మసాలా, సిగరెట్లు, స్మోకింగ్ పైపులు, నాన్ ఆల్కాహాలిక్ బేవరేజెస్‌పై 40 శాతం జీఎస్టీ విధించడం.. వాటిని వియోగించేవారికి భార మే. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనంతరం ఆర్థిక మంత్రి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.కౌన్సిల్ నిర్ణయంతో సామాన్యులు వాడే వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.
మంత్రుల బృందం ఆమోదించిన రెండు స్లాబుల జీఎస్టీకి కౌన్సిల్ కూడా ఆమోదముద్ర వేయడంతో ఇక జీఎస్టీ మరింత సరళీకృతం కానుంది. ప్రధాని మోదీ చెప్పిన విధంగా నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకే ఇలా స్లాబులను తగ్గించినట్టు మంత్రి తెలిపారు. రెండు స్లాబుల జీఎస్టీ విధానంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు తమ మద్దతును తెలిపాయి. జీఎస్టీలో తీసుకొస్తున్న సంస్కరణలు సామాన్యులకు, ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి జీఎస్టీ కౌన్సిల్ భారీ ఊరట కల్పించింది. ఎంఎస్‌ఎంఈ రంగంలో కొత్త పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు వారాల సమయం పడుతుండగా.. ఈ సమయాన్ని మూడు రోజులకు కుదించాలని కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.
జీఎస్టీ సంస్కరణలకు జైకొట్టిన ఏపీ
కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు తమ మద్దతు తెలిపాయి. జీఎస్టీ సంస్కరణలు దేశంలోని పేద ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉన్నాయని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా కేంద్రం ప్రతిపాదనలకు మద్దతు తెలిపారు. జీఎస్టీ సమావేశానికి హాజరైన అస్సాం ఆర్థిక మంత్రి అజంత నియోగ్ కూడా మద్దతు ప్రకటించారు. మరోవైపు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నూతన జీఎస్టీ సంస్కరణలపై స్పందించారు. ఈ సంస్కరణల మూలంగా జమ్ముకశ్మీర్‌కు 10 నుంచి 12 శాతం రాబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటుతో సతమతం అవుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల జార్ఖండ్ రాష్ట్రానికి ఏడాదికి రూ. 2,000 కోట్ల నష్టం వాటిల్లనుందని జార్ఖండ్ ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్ పేర్కొన్నారు.
దుస్తులు, చెప్పులపై 5శాతం జీఎస్టీ
రూ. 2,500లోపు విలువ గల దుస్తులు, చెప్పులపై ఉన్న జీఎస్టీని తగ్గించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 2,500 ఉన్న వస్తువులను 5 శాతం జీఎస్టీ స్లాబులోకి మార్చారు. ప్రస్తుతం రూ. 1,000 కంటే ఎక్కువ ఖరీదు గల దుస్తులు, చెప్పులపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనిని 5 శాతం స్లాబులోకి తీసుకొచ్చేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
మా ఆదాయానికి రక్షణేది?
జీఎస్టీ కౌన్సిల్‌లో బీజేపీయేతర రాష్ట్రాల ప్రతినిధులు ఆదాయ రక్షణను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. జీఎస్టీ స్లాబులను తగ్గించడం వల్ల రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపైనే బీజేపీయేతర రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తినట్టు సమాచారం. ఆదాయ నష్టానికి సమానమైన స్థాయిలో నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ స్లాబులు తగ్గడం మూలాన అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. తక్కువ జీఎస్టీ వల్ల కంపెనీలు లాభపడకుండా ఆ లాభం వినియోగదారులకు చేరేలా చూడాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేసినట్టు సమాచారం. కేవలం బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొన్ని ఇటువంటి ఆందోళనలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సెస్ ద్వారా రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల పాటు నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్రం చెప్పినట్టు వినికిడి.
సామాన్యులకు ఊరట కల్పించేందుకే..
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడి యాతో మాట్లాడారు. ‘సామాన్యునికి ఊరట కల్పించేందుకే ఈ సంస్కరణలు ప్రవేశపెట్టాం. సామాన్యులు రోజువారీగా ఉపయోగించే చాలా రకాల వస్తువుల ధరలు తగ్గే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సంస్కరణల వల్ల చాలా రంగాలు ప్రయోజనం పొందుతాయి. వ్యవసాయరంగానికి కూడా ఈ సంస్కరణలు ఎంతో ప్రయోజనకరం. హెల్త్ సెక్టార్ కూడా భారీగా ప్రయోజనం పొందనుంది.
ఈ సంస్కరణల్లో భాగంగా 175 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాలు, పన్నీర్, స్నాక్స్, బ్రెడ్ వంటి వస్తువులు మరింత చౌకగా మారనున్నాయి. హెయిర్ ఆయిల్, టాయిలెట్ పేపర్స్, షాంపూలు, టూత్ బ్రష్‌లు, వంటసామగ్రి మొదలయినవి 5 శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. చాలా రకాల ఆహార వస్తువులపై జీఎస్టీని తొలగించాం. కళ్లద్దాలు ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం 12 శాతం స్లాబులో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబులోకి రానున్నాయి. 33 రకాల లైఫ్ సేవింగ్ ఔషధాలపై జీఎస్టీని తొలగించాం. 28 శాతం స్లాబులో ఉన్న 90 శాతం వస్తువులు ప్రస్తుత విధానం వల్ల 18 శాతం స్లాబులోకి వచ్చాయి. అన్ని రకాల టీవీలపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. విలాస వస్తువులు 40 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
అన్నివర్గాలకు ప్రయోజనం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేను మాటిచ్చిన విధంగా తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణ వల్ల సామాన్యునికి భారీ ఊరట కలగడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా బలపడనుంది. పన్ను రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్‌కు అభినందనలు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, రైతులు, ఎంఎస్‌ఎంఈ సెక్టార్లు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. ఈ సంస్కరణలు మన పౌరుల జీవనాలను మరింత సరళీకృతం చేస్తాయి. నరేంద్ర మోదీ, భారత ప్రధాని
22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు
రెండు స్లాబుల జీఎస్టీని ఈ నెల 22 నుంచి అమలు చేయనున్నారు. బుధవారం జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త స్లాబ్ రేట్లను ఈ నెల 22 నుంచి అమలు చేయనున్నారు. 12, 28 శాతం స్లాబులను తొలగించిన కౌన్సిల్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని కూడా రద్దు చేశారు. విలాసవంత వస్తువులపై 40 శాతం జీఎస్టీకి కౌన్సిల్ పచ్చజెండా ఊపింది.