calender_icon.png 4 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటు

04-09-2025 01:40:16 AM

  1. సీబీఐ పనితీరుపై రాహుల్, రేవంత్ ద్వంద్వ వైఖరి
  2.   21నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగమైంది
  3. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
  4. మణుగూరు సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్‌రావు బీఆర్‌ఎస్‌లో చేరిక

హైదరాబాద్,సెప్టెంబర్ 3(విజయ క్రాంతి): మల్లన్నసాగర్, కొండపొచమ్మసాగర్‌లతో రాబోయే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐని మోదీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్యస్థితికి నిదర్శనమన్నారు.

పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్‌రావు, ఆయన అనుచరులు బుధవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని, ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ర్టంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందని వాపోయారు. రేవంత్‌రెడ్డి తన మాటలతో, చేతలతో సీఎం పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడీ లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవన్న కేటీఆర్,  కరోనా కష్టకాలంలో రాష్ర్ట ఆదాయం సున్నా అయినా రైతుబంధు, పెన్షన్లు, జీతాలను కేసీఆర్ ఆపలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పినా సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో ఎనిమిదింటిని పూర్తిగా, రెండింటిని పాక్షికంగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అయినప్పటికీ సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు.

పార్టీకి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మధ్య సమన్వయం లోపించిందా? యూనియన్ అంతర్గత రాజకీయాలు పార్టీపై ప్రభావం చూపించాయా? అనే కోణంలో ఆనాడు చర్చించామని చెప్పారు. పార్టీ మద్దతు లేకున్నా, మణుగూరు డివిజన్‌లో కేవలం 24 ఓట్ల తేడాతోనే యూనియన్ నాయకులు ఓడిపోయారన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో తాను భద్రాచలం, కొత్తగూడెం పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు.