calender_icon.png 4 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ రాజధానిగా తెలంగాణ

04-09-2025 01:36:53 AM

  1.   180 మందికి ఉపాధి.. మున్ముందు మరింత మందికి..
  2. త్వరలో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం.. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందిస్తాం..
  3. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
  4. హైదరాబాద్‌లో ఎంటర్‌ప్రైజెస్ ప్రొక్యూర్‌మెంట్, సప్లయర్ కొలాబరేషన్ జీసీసీ ప్రారంభోత్సవం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా మార్చడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎంటర్‌ప్రైజెస్ ప్రొక్యూర్‌మెంట్ (అమెరికా), సప్లయర్ కొలాబరేషన్ సంస్థలు నెలకొల్పిన జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ను  బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ఒక్క సాంకేతికతలోనే కాకుండా అన్ని రంగాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారందని, దిగ్గజ బహుళజాతి కంపెనీలను నగరం ఆకర్షిస్తున్నదని వివరించారు. కొత్త జీసీసీతో 180 మందికి ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500లకు చేరుతుందని స్పష్టం చేశారు. జాగర్ ఏఐ ప్లాట్‌ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ రంగాలకు జీసీసీ విశిష్ట సేవలు అందిస్తుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో ఏకంగా 70 జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభించామని వెల్లడించారు. ఈ ఏడాది 100 జీసీసీలను ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వివరించారు.

ఏఐ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఏఐ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. తద్వారా ప్రపంచానికి ఏఐ నిపుణులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో జీసీసీ సీఈవో ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ అండ్ ఏఐ ఆఫీసర్ డెవలప్‌మెంట్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ పాల్గొన్నారు.