04-09-2025 01:54:00 AM
హనుమంతుడి గుడిలేని గ్రామం ఉంటుందేమో గానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరుండదు
భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ‘హనుమంతుడి గుడిలేని గ్రామం, తండా, గూడెం ఉంటుందేమో గానీ, మున్ముందు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పథకం వర్తింపజేస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బుధ వారం ఆయన మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకలకు హాజరయ్యా రు.
లబ్ధిదారులతో ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకుని వారితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఇదే మండలంలోని దామచర్ల గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో బీజం పడిందని పేర్కొన్నారు.
‘మా ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మాకు కావాలని ఖమ్మం ప్రజలు నాడు ఉద్యమించారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేశారు’ అని గుర్తుచేసుకున్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సాచురేషన్ పద్ధతిలో అమలు చేశారని కొనియా డారు. 10 సంవత్సరాల పాలనలో 25 లక్షల ఇండ్లు పూర్తి చేశారని కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ పేరుతో ఇండ్లు నిర్మించారని తెలిపారు.
ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు భూరతి అమలు చేస్తున్నామని తెలిపారు. తన ఇంటి గృహప్రవేశం నాడు దొరికిన సంతోషం కంటే, నేడు ఈ పేద ప్రజల గృహప్రవేశం చూస్తుంటే.. ఇంకా ఎక్కువ ఆనందం కలిగిందని వ్యాఖ్యానించారు. పేదరికం పేదల జీవన విధానంలో భాగమని, పేదరికాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నామని తెలిపారు.
గత పాలకులు రేషన్ కార్డులు సైతం జారీ లేదని, కనీసం కొత్త పేర్ల నమోదుకైనా అవకాశం ఇవ్వలేదన్నారు. కానీ, ప్రజాప్రభుత్వంలో లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందించామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా రైతులకు రూ 20,600 కోట్ల రుణమాఫీ పూర్తి చేశామన్నారు. పేదల తలరాతను మార్చేది విద్య మాత్రమేనని, తమ ప్రభుత్వం విద్య రంగంపై ఏటా రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.
100 నియోజకవర్గాల్లో రూ 20 వేల కోట్లు పైగా ఖర్చు చేస్తూ యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నామని వివరించారు. విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్స్ చార్జీలు 200 శాతం పెంచామని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి, యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. యువత చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రానున్న 10 రోజుల్లో నియోజకవర్గాలవారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలిపించుకుని ఆయా నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల మంది పేద కుటుంబాలకు జీరో కరెంట్ బిల్లు వస్తుందని, 4 వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని వెల్లడించారు. 14 వేల కోట్లతో సన్న బియ్యం, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు చేస్తున్నామన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పేదల వరకు అందుతున్నాయని తెలిపారు.
పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక పోరాటాలు చేసిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా సంయమనం కొల్పోకుండా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం సీతారామ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారించాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీలు పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హౌసింగ్ సంస్థ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, అదనపు కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు.
వైఎస్సార్ ప్రభుత్వ తరహాలో సంక్షేమం: మంత్రి శ్రీహరి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. గత పాలకులు డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట పేదలను మోసం చేసిందని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందాయని గుర్తచేశారు. అదే తరహాలో సీఎం రేవంత్ గూడు లేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా కొన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పటికీ, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలకులు లక్షల కోట్లు దోచుకున్నరు..
బీఆర్‌ఎస్ పాలకులు పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించి, లక్షల కోట్లు దోచుకున్నారని సీఎం ఆరోపించారు. ఇప్పుడు వాళ్లల్లో వాళ్లే తన్నుకుంటున్నారని, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘మీ పంచాయితీల్లోకి నన్ను లాగకండి. మాకు చాలా పనులు ఉన్నాయి. మేం పేదలకు ఇండ్లు కట్టించాలి. రేషన్‌కార్డులు పంచాలి’ అని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు దొడ్డు బియ్యం అందేదని, తమ ప్రభుత్వం పేదలు కడుపు నిండా తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక సంక్షోభంలోనూ పథకాలు: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుచేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, అదే విధంగా తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నదని వివరించారు.