23-04-2025 01:36:43 AM
సూర్యాపేట, ఏప్రిల్ 22: పోలీసు ఉద్యోగులు తాము నిర్వహించే విధులలో జాగ్ర త్తగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం మునగాల పోలీస్ స్టేషన్ పరిధి ముకుందాపురం వద్ద గల జాతీయ రహదారిపై కానిస్టేబుల్ రాంబాబు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ నందు ఉంచడంతో మంగళవారం ఎస్పీ సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.... విధులలో అలసిపోతే కాస్త విశ్రాంతి తీసుకోవాలని, విశ్రాంతి అనంతరం ప్రయాణాలు చేయడం మంచిదని అన్నారు. రాత్రి వేళ సొంత వాహనాలపై ప్రయాణం చేయకపోవడం మంచిదన్నారు. పోలీసు సిబ్బంది అందరూ సాలరీ బ్యాంక్ అకౌంట్ కు పోలీస్ సాలరీ ప్యాకేజీ తీసుకోవాలని కోరారు. రాంబాబు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాల ఆదుకుంటుందని, ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా, పోలీసు శాఖ ద్వారా రావలసిన ఆర్థిక తోడ్పాట్లను, ప్రభుత్వ సహకారంతో అందించే కారుణ్య నియామక ఉద్యోగం త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు.