calender_icon.png 22 December, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాట్సాప్‌లో ఘోస్ట్ దడ!

22-12-2025 02:46:39 AM

ఘోస్ట్ పేయిరింగ్ లింక్ క్లిక్ చేశారో అంతే..

అప్రమత్తంగా ఉండండి: సీపీ సజ్జనార్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): నిత్యజీవితంలో భాగమైపోయిన వాట్సాప్‌ను ఇప్పుడు సైబర్ నేరగాళ్లు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో మోసాలకు పాల్పడు తున్న కేటుగాళ్లు.. తాజాగా ఘోస్ట్ పేయిరింగ్ పేరుతో మరో కొత్త స్కామ్‌కు తెరలేపారు. వినియోగదారులకు తెలియకుండానే, వారి అనుమతి అవసరం లేకుండానే వాట్సాప్ ఖాతాలను హైజాక్ చేస్తున్న వైనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదకర స్కామ్‌పై ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

ఏంటీ ఘోస్ట్ పేయిరింగ్ అంటే.. సాధారణంగా వాట్సాప్ వెబ్‌ను కంప్యూటర్‌లో వాడాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. కానీ, ఈ ఘోస్ట్ పేయిరింగ్‌లో హ్యాకర్లు ఆ అవసరం లేకుండానే దొడ్డిదారిన ప్రవేశిస్తారు. ‘మీకు తెలిసిన వారి నంబర్ నుంచో, లేదా కొత్త నంబర్ నుంచో..హేయ్.. మీ ఫొటో చూశారా?  లేదా ఈ వీడియోలో ఉన్నది మీరేనా? అంటూ ఒక లింక్ వస్తుంది. ఆత్రుతతో ఆ లింక్ క్లిక్ చేస్తే.. అది ఒక నకిలీ వాట్సాప్ వెబ్ పేజీకి తీసుకెళ్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీ ప్రమేయం లేకుండానే ‘మీ ఖాతా హ్యాకర్ డివైజ్‌కు పేయిర్’ అయిపోతుంది.

దీనికి ఎలాంటి ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ అవసరం లేదు. ఒక్కసారి ఖాతా హ్యాకర్ల చేతికి చిక్కితే.. ‘మీ వ్యక్తిగత చాటింగ్‌లు, ఫొటోలు, వీడియోలు, బ్యాంక్ వివరాలు అన్నీ వారి పరమవుతాయి. అంతటితో ఆగకుండా మీ కాంటాక్ట్స్ లిస్ట్‌ను దొంగిలించి, మీ పేరుతో మీ స్నేహితులు, బంధువులకు మెసేజ్‌లు పంపి డబ్బులు అడగడం’ వంటి మోసాలకు పాల్పడతారు. చివరకు అసలు ఖాతాదారుడే వాట్సాప్ వాడలేని విధంగా లాక్ చేసే ప్రమాదం ఉంది. ఈ కొత్త తరహా మోసంపై సీపీ సజ్జనార్ ‘ఎక్స్’.. వేదికగా స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎంత తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు అని ఆయన సూచించారు. ఒక చిన్న అజాగ్రత్త మొత్తం ఖాతాను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు.