calender_icon.png 28 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బినామీలు కదలరు..అద్దె చెల్లించరు

28-11-2025 12:00:00 AM

  1. 21 దుకాణాల అద్దె బకాయి.. రూ. 21.17 లక్షలు
  2. చోద్యం చూస్తున్నమున్సిపాలిటీ యంత్రాంగం

అచ్చంపేట, నవంబర్ 27: మున్సిపల్ అధికారులకు ఆదాయమంటే.. కేవలం ఆస్తి పన్ను అనే భ్రమలోనే ఉన్నట్లున్నారు. ఆస్తి, ఇంటి పన్ను వసూళు విషయంలో నిక్కచ్ఛిగా వ్యవరించే యంత్రాంగం.. కీలకమైన వ్యాపార దుకాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటికి హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాని రహదారికి ఆనుకొని 28 షాపింగ్ కాంఫ్లెక్స్ లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ సమయంలో నిర్మించిన వీటిని అప్పట్లోనే వివిధ వర్గాలకు చెందిన వారికి నామమాత్రపు అద్దెతో కేటాయించారు.

అప్పట్లో దుకాణాలు దక్కించుకున్న వారిలో కొందరు కొనసాగుతుండగా.. మరికొందరు వదిలేశారు. దీంతో కొంత మంది రాజకీయ నేతలను ఆశ్రయించి.. ఖాళీ దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 28 దుకాణాలకు గాను.. ఏడు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 21 దుకాణాల్లోని వారు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 

అక్రమంగా బినామీల తిష్ట..

అప్పట్లో దుకాణాలు దక్కించుకున్నవారిలో కొంత మంది తమకు కేటాయించిన దుకాణాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చి అధనపు ఆదాయం పొందుతున్నారు. వారికి ఆ దుకాణాలు జేబు సంస్థలుగా మారాయి. ఇదంతా మున్సిపాలిటీలోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసినా.. తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ప్రస్తుతం 1 నుంచి 9 దుకాణం వరకు నెల అద్దె రూ. 6500, 10-14 దుకాణం వరకు నెల అద్దె రూ.4500, 15-28 దుకాణం వరకు నెల అద్దె రూ. 2500 ఉంది. ఇదే మార్గంలోని ప్రయివేటు దుకాణాల కనీస అద్దె రూ. 15 నుంచి 25 వేల వరకు ఉంది. కానీ మున్సిపాలిటికి చెందిన అద్దెలు నామమాత్రంగానే ఉన్నాయి. 

బకాయిల గుదిబండ..

దుకాణాలు పొందిన వారు మొదట్లో అద్దె క్రమం తప్పకుండా చెల్లించేవారు. మూడు నెలలకు మించి బకాయి ఉంటే అప్పట్లోని మేజర్ గ్రామపంచాయతీ, నగర పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి హెచ్చరించి.. బకాయి వసూళు చేసేవాళ్లు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా  మారిన తర్వాత రెగ్యులర్ కమిషనర్, ఇతర కీలకమైన సిబ్బంది లేకపోవడంతో అద్దె బకాయి వసూళ్ల గురించి ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపించలేదన్న వాదన వినపడుతోంది.

దీనికి తోడు అద్దె వసూళు చేయాల్సిన బిల్ కలెక్టర్లు, సిబ్బంది సైతం.. ‘మాముళు’గానే చూసి చూడనట్లుగా వ్యవహరించారనే అరోపణలు ఉన్నాయి. దీంతో 2021 సంవత్సరం  నుంచి చాలా మంది అద్దె సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ప్రస్తుతం 21 దుకాణాలకు సంబంధించిన అద్దె బకాయి రూ. 21.17 లక్షలకు పెరిగింది.

త్యధికంగా 4వ దుకాణం అద్దె 59 నెలలకు సంబంధించి రూ. 3,53,500, 14వ దుకాణం అద్దె రూ. 2.40 లక్షలు,  19వ దుకాణం రూ. 1.19 లక్షలు, 20వ దుకాణం అద్దె 1,29,500 బకాయి, 10వ దుకాణం అద్దె రూ. 1,03,500, 18వ దుకాణం అద్దె రూ. 1.10 లక్షలు, 22వ దుకాణం అద్దె రూ. 1.88 లక్షలు, 11, 12 దుకాణాల బకాయి మొత్తం 1,66,500 ఉంది.

అలాగే దుకాణాల రూ. 30 వేల పైచిలుకు అద్దె బకాయి ఉన్న వారు 13 మంది ఉన్నారు. వీరందరి నుంచి ఇంత పెద్ద మొత్తంలో వసూళు చేయడమంటే అధికారులకు తలకుమించిన భారమే.

రాజకీయ ఒత్తిళ్లు

వ్యాపార సముదాయ దుకాణల అద్దె వసూళు చేయడమంటే.. అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే అనే ఆరోపణలు ఉన్నాయి. భారీగా పేరుకుపోయిన అద్దె బకాయి గురించి నోటీసులు జారీ చేస్తే అందులోని కొంత మంది అధికార పార్టీ నేతలను, ఇతర ప్రముఖులను ఆశ్రయించే అవకాశం ఉంది. వారి ఒత్తిడితో పూర్తిస్థాయి బకాయిలు వసూళు అనేది ప్రశ్నార్థకమే. దీనికి తోడు బినామీలను తొలగించడమంటే మున్సిపల్ అధికారులకు సాహసమనే చెప్పొచ్చు. ఏదైమైనా రాజకీయ నేతల ఒత్తిడి లేకుంటే మున్సిపాలిటీకి ఆదాయం పెరగడంతో పాటు.. నిజమైన వారికి న్యాయం జరుగుతుంది.

నోటీసులిస్తాం 

అద్దె బకాయిలు భారీగా పేరుకుపోయిన విషయం వాస్తవమే. గతంలోని అధికారులు ఎందుకు వసూళు చేయలేదో తెలియదు. బకాయిలు ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తాము. బినామీలను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతాము. దుకాణాలు పొందిన నిర్వాహకులు సకాలంలో అద్దె చెల్లించి సహకరించాలి. రీటెండర్, అద్దె పెంపు గురించి మున్సిపల్ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతి, ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాము.

- మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట