calender_icon.png 26 July, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేయాలి

25-07-2025 11:02:03 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఇందిర సౌర గిరి జలవికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గురించి ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన, గిరిజన సంక్షేమ, డిఆర్డిఏ, అటవీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం నిర్దేశిత లక్ష్యం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, పథకం ద్వారా లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనాల గురించి సంబంధిత శాఖల అధికారులు వివరించారు. ప్రభుత్వం ఈపథకం కింద హనుమకొండ జిల్లాకు 2025 -2026 సంవత్సరానికి గాను 64 మంది లబ్ధిదారులకు చెందిన 58 ఎకరాల పోడు భూములకు మంజూరు ఇచ్చినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా పోడు పట్టాలు కలిగిన గిరిజనులకు 2.20 ఎకరాల భూమి కలిగిన గిరిజన రైతుకు రూ.6 లక్షలతో బోరు, పంపుసెట్టు, 5 లేదా 7.5 హార్స్ పవర్ గల మోటారు, పైపులు, సోలార్ పలకలు ఉచితంగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికారులు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి లబ్ధిదారులను మండల స్థాయి కమిటీలు ఎంపిక చేసి, కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీకి ఎంపిక కోసం అందేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు లబ్ధిదారులకు ఉండాల్సిన 2.20 ఎకరాల భూమి కంటే తక్కువ ఉన్నట్లయితే చుట్టుపక్కల ఉన్న రైతులలో ఇద్దరూ లేదంటే ముగ్గురిని కలిపి ఒక యూనిట్ గా పరిగణిస్తారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో  చిత్రా మిశ్రా, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిటిడిఓ ప్రేమ కళ, డిఆర్డివో మేన శ్రీను, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జేఎన్ఎస్ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్

హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఆమె కలియతిరిగారు. జేఎన్ఎస్ స్టేడియంలోని వసతి సౌకర్యాలను కలెక్టర్ డివైఎస్ఓ అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. మొదటగా అథ్లెటిక్ ట్రాక్ ను పరిశీలించారు. అనంతరం బాలబాలికల హాస్టల్ గదులను తనిఖీ చేశారు. అలాగే స్టేడియంలోని మేస్ హాస్టల్ ను, గ్యాలరీలను పరిశీలించారు. జేఎన్ఎస్ స్టేడియంలో క్రీడా వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే హనుమకొండ జేఎన్ఎస్లో త్వరలో ఏర్పాటు చేసే తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్ సౌకర్యాలు ఏర్పాటుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోతు అశోక్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వర్షాకాలం దృష్ట్యా  భారత వాతావరణ శాఖ సూచనలు మేరకు హనుమకొండ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజల సౌకర్యార్థం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు 24 గంటల పాటు సేవలందించేందుకు కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.  కంట్రోల్ రూమ్ ను సంప్రదించేందుకు  టోల్ ఫ్రీ నెంబర్  1800 425 1115 అందుబాటులో ఉంటుందని కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు.