15-11-2025 07:11:16 PM
గద్వాల: విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని, నిరంతరం సాధన చేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా ఉపాధి కల్పన అధికారిని ప్రియాంక అన్నారు. జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఆదేశాల మేరకు శనివారం గద్వాలలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్, ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడే విజయం లభిస్తుందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్, వంటగదిని తనిఖీ చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి తెలియజేశారు.