15-11-2025 08:26:55 PM
ఆట పాటతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రజా కళాకారుడు నరసయ్య
గరిడేపల్లి,(విజయక్రాంతి): మాదకద్రవ్యాలు తో నేటి యువత ఎలా చెడిపోతున్నారో అనే విషయంపై ఆటపాట ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండల పరిధిలోని కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ అధ్యక్షతన శనివారం విద్యార్థులకు ఆటపాట ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా కళాకారుడు బాదే నరసయ్య మాదక ద్రవ్యాలతో ఎటువంటి అనర్ధాలు జరుగుతాయని మాట ఆట పాట తో వినిపిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి డ్రగ్స్ తో నేటి యువత పెడదారి పడుతుందని, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని,సెల్ ఫోన్ లో ఉన్న యాప్ ల ద్వారా ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారని, భవిష్యత్తుని నష్టపోతున్నారని తెలిపారు.
కష్టపడి చదువుకుంటే విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు.పరీక్షలో ఫెయిల్ అయినా, చదువు అనంతరం ఉద్యోగం రాకపోయినా, ప్రేమించిన అమ్మాయి నిరాకరించిన యువత ఆత్మహత్యకు పాల్పడటం సరైనది కాదన్నారు. జీవితంలో ఎదురైన సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని కోరారు.ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలని పర్యావరణాన్ని రక్షించాలనే అంశాలతో పాటు ఇతర విషయాలపై పాట రూపంలో అవగాహన కల్పించారు.