15-11-2025 08:24:00 PM
ఆదివాసులతో కలిసి నృత్యాలు చేసిన రాజర్షి షా..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని బిర్సా ముండా విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఆదివాసి పాటలకు అనుగుణంగా కలెక్టర్ నృత్యాలు చేసి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజును జనజాతి గౌరవ దినోత్సవంగా ప్రకటించటం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని అన్నారు. బ్రిటిష్ పాలన కాలంలోనే జల్-జంగల్-జమీన్ కోసం ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం అపూర్వమని గుర్తుచేశారు. ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంటూ, బిర్సా ముండా ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గిరిజన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.