08-11-2025 04:44:08 PM
ఏజెన్సీ ప్రాంతమైన సేవలు అద్భుతం..
సి ఆర్ ఎం- జాతీయ బృందం కితాబు..
భద్రాచలం (విజయక్రాంతి): జిల్లాలో వైద్య సేవలు, ప్రమాణాలు పరిశీలించడానికి వచ్చిన సిఆర్ఎం(కామన్ రివ్యూ మిషన్) బృంద సభ్యులు దాక్టర్ జి బి సింగ్ రాష్ట్ర స్థాయిలో నిన్న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో జిల్లాలో తాము పరిశీలించిన ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రుల సేవలపై ప్రత్యేక ప్రస్తావన తెచ్చారు. మారుమూల ప్రాంతాల్లో సైతం స్పెషలిస్ట్ వైద్య సేవలు అద్భుతంగా అందుతున్నాయని, మంచి ప్రమాణాలు సైతం పాటిస్తూ నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. అన్ని స్థాయిలలో సిబ్బంది సైతం ఎంతో శ్రద్ధ, అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ఆసుపత్రులలో అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చాలా మంది రోగులతో తాము మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని, వైద్య సేవలపై అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఆసుపత్రులలో వార్డులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ లు చాలాబాగా నిర్వహిస్తున్నారని,సానిటేషన్ కూడా బాగుందని కితాబిచ్చారు. జిల్లాలోని డయలిసిస్ సేవలు కూడా చాలా బాగున్నాయని అన్ని సెంటర్స్ లో అన్ని బెడ్స్ నిండి ఉన్నాయన్నా సంగతి తాము గమనించామని తెలిపారు. ఇల్లందు ఆసుపత్రి లో భవన స్థలం తక్కువ ఉన్నప్పటికీ సేవలు స్థాయికి మించి చేస్తున్నారని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం రేడియాలజిస్ట్ ,మత్తు వైద్యులు , ఇతర స్పెషలిస్ట్ వైద్యులు సరిపడా స్థాయిలో ఉండడం , టిఫాస్కాన్ సేవలు సైతం ఉండడం విశేషం అని తెలిపారు.
భద్రాచలం ఆసుపత్రి జిల్లాకే గర్వకారణం అని, 200 పడకలతో ఐసీయూ,ఎస్ ఎన్ సి యు , ఎన్ ఆర్ సి , ఆపరేషన్ థియేటర్ సేవలు అద్భుతంగా ,ఆదర్శంగా ఉన్నాయన్నారు. తీవ్ర స్థాయిలో సిబ్బంది కొరత ఉన్న వాటిని అధిగమించి అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సిబ్బంది కొరత తీరితే మరింత సేవలను అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిలో ఆసుపత్రిలో ప్రమాణాల విషయం లో నిరంతరంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించారు. ఆసుపత్రులలో మౌలిక వసతులు, సీఎస్ ఆర్ నిధుల వినియోగం, ఇతర విషయాలలో జిల్లా కలెక్టర్ మద్దతు, ప్రోత్సాహం బాగుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో సి ఆర్ ఎం సభ్యులతో పాటు రాష్ట్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ కమీషనర్ సంగీత సత్యనారాయణ, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్,డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్, భద్రాద్రి జిల్లా డిసిహెచ్ ఎస్ డాక్టర్ రవి బాబు, డీఎంహెచ్ ఓ డాక్టర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు