calender_icon.png 8 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో గెలుపొందిన బాలికలకు బహుమతుల ప్రధానం

08-11-2025 06:13:49 PM

జోనల్ మీట్ ముగింపు సమావేశంలో జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, ఏఎంసీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్..

కోదాడ/నడిగూడెం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బాలికలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ సొసైటీకి, రాష్ట్రానికి, పాఠశాలలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జోనల్ ఆఫీసర్ హెచ్. అరుణ కుమారి అన్నారు. 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ మూడు రోజులుగా నడిగూడెం గురుకుల పాఠశాలలో నిర్వహించగా శనివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ స్థాపకుడు ఎస్ ఆర్ శంకరన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అరుణ కుమారి మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో చదువుకోవటం తమ అదృష్టం అన్నారు. క్రీడల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. గురుకుల సొసైటీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్రీడల్లో రాణించేలా జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎదగవచ్చని పేర్కొన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని 9 పాఠశాలల విద్యార్థులు 765 మంది మూడు రోజులు వివిధ క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాలను చాటుకున్నారని అన్నారు. స్నేహ భావాన్ని, ఐక్యమత్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు క్రీడలు తోడ్పడతాయన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని అందరి ప్రశంసలను పొందాలని అన్నారు. జోనల్ మీట్ విజయవంతనికి సహకరించిన పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల ప్రధాన ఆచార్యులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు.

సహకరించిన మండల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గురుకులాల్లో విద్యతో పాటు క్రీడా రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. విద్యార్థుల గురించి ఆమె ఆలపించిన పాట అందర్నీ ఆకట్టుకుంది. గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నట్లు ఆమె తెలియజేశారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. సర్టిఫికెట్లు అందజేశారు.

జోనల్ అధికారి అరుణకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ, తదితరులను ఈ సందర్భంగా పాఠశాల తరఫున సన్మానించారు. క్రీడలను విజయవంతం చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డిసిఓ, సిహెచ్.పద్మ, నడిగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, డాక్టర్ విద్యాసాగర్, ఎస్సై అజయ్ కుమార్ ఆయా పాఠశాలల  ప్రధాన ఆచార్యులు అరుణ, సుష్మ, డి వెంకటేశ్వర్లు, శ్రీరామ్, వరలక్ష్మి, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.