08-11-2025 06:21:23 PM
65వ జాతీయ రహదారిపై రైతుల ధర్నా
మద్దతు తెలిపిన బీఆర్ ఎస్, కాంగ్రెస్
ధర్నా, రాస్తారోకోతో నిలిచిన వాహనాలు
ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్లీయర్ చేసిన పోలీసులు
మునిపల్లి: సీసీఐ తీసుకవచ్చిన కపాస్ యాప్ తో తాము పడరాని కష్టాలు పడుతున్నామని, తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపి రైతులకు సీసీఐ చేస్తున్న మోసాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మండల సీనియర్ నాయకుడు బుర్కల పాండు తదితరులు మాట్లాడుతూ కొత్తగా సీసీఐ తీసువచ్చిన కొత్త నిబంధనలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, అందుకు పాత నిబంధనలతో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే సీసీఐలో పత్తి తేమ శాతం 12లోపు ఉంటే కొర్రీలు పెడుతున్నారని, అందుకు 20 వరకు తేమ వచ్చినా.. రైతుల నుంచి పత్తి పంటను కొనుగోలు చేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు రైతుల తరుపున పోరాటం చేస్తామని వారు తేల్చి చెప్పారు. అంతకు ముందు ధర్నా చేస్తున్న విషయాన్ని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ గా అక్కడకు చేరుకున్నారు. కంకోల్ టోల్ ప్లాజా 65 జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో అర్ధగంట పాటు ట్రాఫిక్ జామ్ అయి ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఇందులో భాగంగానే సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా రైతులను నిండా ముంచుతున్నారని, లలిత్ కుమార్ గుప్తా.. డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పోలీసులు క్లీయర్ చేసి ఎక్కడి వాహనాలు అక్కడ పంపిచేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.