08-11-2025 06:17:01 PM
దుంపలకుంటలో అక్రమార్కుల ఇష్టారాజ్యం
విద్యుత్ మీటర్లకు ఎన్‌వోసీ ఇస్తున్న అధికారులు
గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి
కొల్చారం: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపైనే రేకులతో దుకాణాలను ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కొల్చారం మండలం దుంపలకుంట వారాంతపు సంతలో దుంపలకుంట నుండి కౌడిపల్లి వెళ్లే మార్గంలో రోడ్డుపై నూతనంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులతో సంతకు వచ్చే వినియోగదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బుల కుంట చౌరస్తాలో దుంపలకుంట నుండి కౌడిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై దుంపలకుంట నుండి ఎనగండ్ల వెళ్లేదారిలో, మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై మూడు మార్గాలలో అనుమతులు లేకుండా రోడ్లపైనే రేకులతో దుకాణాలను ఏర్పాటు చేశారు.
దీంతో మూడు మార్గాలలో రోడ్లు కూచించుకు పోయాయి. ప్రతి మంగళవారం జరిగే సంతకు కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, అందోల్ తదితర మండలాల నుండి వందల సంఖ్యలో ప్రజలు వస్తారు. దుంపకుంట నుండి కౌడిపల్లి వెళ్లే ప్రయాణికులు సంతను దాటి వెళ్లాలంటేసుమారు అరగంట సమయం పడుతుంది. దీంతో సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పంచాయతీ కార్యదర్శికి తైబజార్ వసూలుపై ఉన్న శ్రద్ధ మార్కెట్లో వసతులు కల్పించడంపై లేదని వ్యాపారస్థులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ఆ దుకాణాలకు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు సైతం ఇస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఎనగండ్ల గ్రామపంచాయతీ పరిధిలో దుంపలకుంట చౌరస్తాలో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా ఇండ్లు, వ్యాపార సంస్థల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు రోడ్డుపై సైతం దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని రోడ్డుపై ఆక్రమణలను తొలగించాలని ఎనగండ్ల పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి లను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు.