10-07-2025 12:00:00 AM
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి భూములు కబ్జా కావడం బాధాకరం. భద్రాద్రి రాముడిపై భక్తితో ఓ దాత దానం చేసిన దాదాపు 900 ఎకరాల స్థలాన్ని నేడు కొందరు కబ్జా చేస్తున్నారు. ఇదే విషయంలో గతంలో దేవాలయ గోశాలను కూడా కబ్జా చేస్తూ.. గోశాలకు వెళ్లేందుకు దారి బంద్ చేసిన విషయంపై విశ్వహిం దూ పరిషత్ భారీ ఎత్తున ఆందోళన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాటి జగన్ ప్రభుత్వం భద్రాద్రి రాముడి భూముల రక్షణకు ప్రత్యేక కమిటీ వేసింది.
నేడు మళ్లీ కబ్జాదారులు చెలరేగిపోవడం.. ఏకంగా ఆలయ ఈవోపైనే దాడి చేయడం అత్యంత హేయం. ఎట్టి పరిస్థితులలోనూ భద్రాద్రి రాములవారి భూమి అంగుళం కూడా వదులుకునేది లేదు. అందుకోసం ఎంత టి ఉద్యమానికైనా వెనకాడేది లేదు. ఆలయ ఈవోపై దాడిని తీవ్రం గా ఖండిస్తున్నాం.
దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి. వెంటనే దేవాలయ భూములు సర్వే చేసి, ప్రహరీ నిర్మిం చాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలూ చొరవచూపి భద్రాద్రి రాముడి భూములు కాపాడాలి. లేనిపక్షంలో భారీ ఆందోళన తప్పదు.
పగుడాగుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్