10-07-2025 12:00:00 AM
వచ్చే నవంబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ప్రారంభించిన ఓటర్ల జాబితా సవరణ వివాస్పదమైంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డును చూపి, ఇవీ మా గుర్తింపు కార్డులంటే చెల్లదని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఆధార్ కార్డును ఎప్పుడూ పౌరుల గుర్తింపుగా చూడటం లేదని, ఆధార్ కార్డులు జారీచేస్తున్న యూఐడీఏఐ సంస్థ సీఈవో చెపుతున్నారు.
బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల కమిషన్ కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణ అంతా ఒక బూటకమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిని ఇలాగే కొనసాగిస్తే కోట్లాది ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోవడం ఖాయం. పేదలు, వలసవచ్చే కార్మికులు ఆధార్ తప్ప వారివద్ద పౌరసత్వం రుజువు చేసుకునేందుకు మరో దారిలేదు. ఎన్నికల కమిషన్ అనాలోచితంగా చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పటివరకు కమిషన్‌కున్న పేరు ప్రఖ్యాతులను తుడిచేసేదిగా మారింది.
దాదాపు నాలుగు కోట్ల మంది బీహారీలు ఇప్పుడు తాము కూడా ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవాల్సివుంది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులను ఓటర్ల గుర్తింపుగా పరిగణించనపుడు, తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడమెలా అని కోట్ల మంది బీహారీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు, ప్రస్తుతమున్న ఓటరు ఐడీ కార్డులు కూడా ‘సర్’ కు సరిపోవంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
దేశంలోని పేద రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. పొట్ట చేతపట్టుకొని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే కార్మికులు, వరదల బారిన పడకుండా తట్టా బుట్టా సర్దుకొని పిల్లా పాపలతో మరో చోటకు వెళ్లే పేదలు ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటారు. ఎవరైనా సరే, మేం చెపుతున్న 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపి రాష్ట్రంలో ఓటరు జాబితాకు ఎక్కాలని ఎన్నికల కమిషన్ చెపుతున్నది.
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగించిన ఓటర్ల జాబితా ఏడాది తిరగకముందే చెల్లుబాటు కాకుండా పోయింది. ఆ జాబితాలో వున్న ఓటర్లలో మరణించినవారి పేర్లను తొలగించడం, 18 ఏండ్లు పైబడినవారిని చేర్చుకోవడంతో జాబితా సవరణ ముగిస్తే సరిపోయేది.
రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకునే పెన్షన్‌కు సంబంధించిన పేపరు, బ్యాంకు, పోస్టాఫీసు పుస్తకాలు, పుట్టిన తేదీ వున్న సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, శాశ్వత నివాసపత్రాలు, అటవీ హక్కుల సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ప్రభుత్వం నుంచి భూమి పొందివుంటే ఆ పత్రాలు.. ఇలా 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఇప్పుడు బీహార్ ఓటరు సంపాదించుకోవాల్సివుంది.
ఈ డాక్యుమెంట్లలో ఏదైనా పేదల వద్ద ఉంటుందా, వలస కార్మికుల వద్ద ఉంటుందా అని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అసంబద్ధ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నందున సత్వరం ఈ విషయంపై పిటిషనర్ల వాదనలను వినేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
పౌరులంతా సమానమే, అందరికీ ఓటు వేసే అవకాశం ఉండాల్సిందేనని రాజ్యాంగం చెపుతున్నది. ఓటు హక్కుకు దళితులను దూరం చేసే విధంగా వున్న ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ) బుధవారం బీహార్ బంద్‌కు పిలుపునిచ్చి రోడ్డెక్కాయి.