04-05-2025 05:19:47 PM
జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్..
మంచిర్యాల (విజయక్రాంతి): తన ముత్తాతలకు స్వర్గ ప్రాప్తి లభించడానికి కఠోర తపస్సు చేసి దివి నుండి గంగను భూమికి తీసుకువచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(District Additional Collector Sabavat Motilal) అన్నారు. ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సగరుని మునిమనవడు అయిన భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భువికి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతుందని అన్నారు. సగరుని వంశస్థులు భవన నిర్మాణ పనులు చేపడతారని, ఉప్పు విక్రయదారులుగా, కార్మికులుగా ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. భవన నిర్మాణ రంగంలో శిక్షణ అందించి, అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని సగర కులస్తులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రవుఫ్ ఖాన్, సాంఘిక సంక్షేమాధికారి రవీందర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఈ. డి. దుర్గాప్రసాద్, సంక్షేమ అధికారులు, భగీరథ వంశస్థులు, డి. ఆర్. పి. లు తదితరులు పాల్గొన్నారు.