04-05-2025 05:29:24 PM
రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు...
మహబూబాబాద్ (విజయక్రాంతి): వచ్చే వానాకాలం పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మేలైన సేంద్రియ సాగు పద్ధతులు, భూసారం పెంపు, పంటల మార్పిడి, రసాయన ఎరువులు క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఈనెల ఐదు నుంచి వచ్చేనెల 15 వరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం, వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్.మాలతి, ఈ.రాంబాబు, ఎన్.కిషోర్ కుమార్, బి.క్రాంతి కుమార్ తోపాటు వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామాల్లో నిర్వహించే అవగాహన సదస్సులో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల తెలిపారు.
సదస్సుల వివరాలు
మే 5న మహబూబాబాద్, 6న కురవి, 7న గూడూర్, 13న కామేపల్లి, 16న డోర్నకల్, 17న కేసముద్రం, 20న కల్వల, 23న గార్ల, 24న కొత్తగూడా, 27న బయ్యారం, 30న మొగిలిచర్ల, 31న గంగారంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అలాగే వచ్చే నెల 3న మరిపెడ, 5న దంతాలపల్లి, 6న తొర్రూర్, 10న ఇనుగుర్తి, 12న నెల్లికుదురు, 13న నరసింహుల పేటలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారని, రైతులు అవగాహన సదస్సులో పాల్గొని వానాకాలంలో సాగులో అనుసరించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.