calender_icon.png 12 October, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవాన్ దాస్ జీవితం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే నాయిని

12-10-2025 08:24:37 PM

హనుమకొండ (విజయక్రాంతి): బి.ఆర్. భగవాన్ దాస్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అశోక జంక్షన్ వద్ద ఉన్న బి.ఆర్ భగవాన్ దాస్ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ దాస్ స్వతహాగా ప్రజల సమస్యల పట్ల గాఢమైన చైతన్యం కలిగిన నాయకులన్నారు. ఆయన జీవితమే ఒక పోరాటమని, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం, ప్రజలకు తాగు సాగునీటిని అందించే దిశగా ఎస్సారెస్పీ కాలువ కోసం, ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. ఆయన ఉద్యమ జీవితం ఒక ప్రజాస్వామ్యపరమైన ఆశయం కోసం సాగిన నడక ఎల్ఐసి, బ్యాంకింగ్ రంగాల కార్మికులకు మద్దతుగా ఆయన పోరాటాలు చేసిన విధానం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు.

భగవాన్ దాస్ ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో తలమానికంగా నిలిచారని, కార్మికుల కనీస వేతనాలు, భద్రతా నిబంధనలు, సేవా హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు అనేక కార్మికుల జీవన ప్రమాణాలను మార్చాయని తెలిపారు. ఆయన కుమారుడు బి.ఆర్. లెనిన్ కూడా పితామహుని మార్గంలో కొనసాగుతున్నారని, వామపక్ష ఆలోచనలతో జర్నలిజంలో, ప్రజాసేవలో చురుకుగా ఉన్నారన్నారు. భగవాన్ దాస్ జీవితమే ఓ పాఠశాలని, ఆయన చూపిన మార్గం ఇప్పటికీ ప్రజల సమస్యలపై ఎలా స్పందించాలో తెలియజేస్తోందని అన్నారు. ఆయన సేవలను గుర్తించుకోవడం మాత్రమే కాదు, ఆ సేవల దిశగా మనం ముందుకు సాగడమే నిజమైన నివాళి అని ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని నాయిని అన్నారు.