22-01-2026 05:30:31 PM
పాదయాత్రలో చూసిన మనిషిని, ఊరును మర్చిపోలేదు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): బడ్జెట్ రూపొందించే సమయంలో తాను పాదయాత్రలో చూసిన, విన్న ప్రజల కష్టాలు తీరేలా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా మోడీ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.పాదయాత్ర సందర్భంగా మోడీ జూరి గ్రామానికి వచ్చిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆరోజు ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు గ్రామంలోనే ఉన్నానని తెలిపారు. ఏరువాక సందర్భంగా వెంకట్రావు పొలంలో అరక దున్ని, ఎద్దులకు బెల్లం–కొబ్బరి తినిపించానన్నారు.అనంతరం లక్ష్మణరావు పటేల్ ఇంట్లో గ్రామస్తులంతా కలిసి గుగ్గిల్లి తిని, భోజనం చేసిన సంఘటనలను గుర్తు చేశారు.తాను పాదయాత్ర చేసిన గ్రామాలు, అక్కడి మనుషులు, వారి సమస్యలను ఏ ఒక్కటినీ మర్చిపోలేదని స్పష్టం చేశారు.
అందులో భాగంగానే మహిళలు ప్రయాణంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశామని, ప్రతి వారం రెండు రోజులు ‘పొలం బాట–ప్రజా బాట’ కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.పాదయాత్రలో చూసిన పిల్లలే దేశ భవిష్యత్తు అన్న ఆలోచనతో వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగే విధంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని వివరించారు. గతంలో మాదిరిగా ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.17 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మహిళలు బట్టల కొనుగోలులో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, దొడ్డు బియ్యంలో పురుగులు ఉన్నాయని ఆనాడు ప్రజలు తెలిపిన సమస్యకు పరిష్కారంగా ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ కూడా పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలకు ఇచ్చిన సమాధానాలేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్,ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్,జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి,ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ కె.హరిత,జిల్లా ఎస్పి నితిక పంత్ ,డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ,అదనపు కలెక్టర్ దీపక్ తివారి,ఏ ఎస్ పి చిత్తరంజన్,ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్లా మంగ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ,మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు,నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీరా శ్యాం నాయక్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.