21-04-2025 12:32:48 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఏప్రిల్ 20(విజయక్రాంతి):ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కుల్చారం మండలం రైతు వేదికలో భూ భారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీవో మహిపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూభారతి చట్టంపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం భూభారతి చట్టంపై సీఎం రేవంత్రెడ్డి సందేశం రైతులకు వినిపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు.నూతన భూ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని,రైతులు, భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. భూసమస్యల పరిష్కరించేందుకు రైతులు, ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, సూచనలతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గఫర్, డీఈఓ రాధా కిషన్, వ్యవసాయ శాఖ అధికారి పుణ్యవతి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులుపాల్గొన్నారు.