calender_icon.png 10 May, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టం అవగాహన సదస్సులు షురూ

18-04-2025 01:27:38 AM

రెండు గ్రామాల్లో పాల్గొన్న కరీంనగర్

కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం-2025 అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారు.

ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో  గురువారం నుంచి 30 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి, ఎన్ని రోజులలో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. సీసీఎల్ కు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారు.

భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంది. గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేది, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించారు.

గతంలో తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం అయ్యే చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దగ్గరికి వచ్చేవి. వేల సంఖ్యలో దరఖాస్తులు ఉండడంవల్ల పరిష్కరించడంలో జాప్యం జరిగేది. భూభారతి ద్వారా కిందిస్థాయి అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయనున్నారు.

రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుంది. దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగనున్నాయి. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్, భూమి ట్రిబ్యూనల్ లో అప్పీల్ చేసుకోవచ్చు. భూ భారతి పోర్టల్ లో ఎకరం భూమి మ్యూటేషన్ కోసం 2500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు తో పాటు వారసత్వ ఒప్పంద పత్రం లేదా వీలునామా కాపీ, నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలి. ఈ దరఖాస్తుల పై తహసిల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారు. 

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయి. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగం పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేయనున్నారు. 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేయనున్నారు. భూ భారతి చట్టం పై ఏమైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించవచ్చు. .

రెండు అవగాహన సదస్సుల్లో పాల్గొన్న కలెక్టర్

జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదికలో, గన్నేరువరంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని అన్నారు.

భూ భారతితో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూసమస్యలు పరిష్కారం కానున్నాయని తెలిపారు. అనంతరం భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు ఒక్కొక్క సెక్షన్, అంశం వారీగా వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్య లక్ష్మి, తహసీల్దార్లు, వివిధ వర్గాల ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.