20-04-2025 12:00:00 AM
కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): ధరణితో నష్టపోయిన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి తీసుకోవచ్చిందని కలెక్టర్ గౌతం అన్నారు. శనివారం మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతిపై అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఉద్యోగులు, రెవెన్యూ నిపుణులతో చర్చించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది అన్నారు. ధరణిలో రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు, హక్కు లు లేనందున ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు.
కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతిలో అవకాశం కల్పించారన్నారు. ధరణి వల్ల నష్టపోయిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయన అన్నారు. గ్రామ పాలనాధికారి నియామకంతో గ్రామ సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, తహసిల్దార్ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు పాల్గొన్నారు.