06-12-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట పరిరక్షణ వ్యవహారంలో కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆయన్ను శుక్రవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టుకు హాజరైన రంగనాథ్.. ధర్మాసనం ఎదుట బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
కోర్టులో విచారణ సందర్భంగా రంగనాథ్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్న విషయం తనకు తెలియకపోవడం వల్లే పనులు జరిగాయని, జరిగిన పొరపాటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని పేర్కొంటూ న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు.
రంగనాథ్ వినిపించిన వాదనలు, సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆయన చెప్పిన క్షమాపణలను రికార్డు చేసుకుంటూ.. ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై తదుపరి విచారణను డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. బతుకమ్మకుంట స్థలం విషయంలో జూన్ 12న హైకోర్టు యథాతథ స్థితి పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు బుల్డోజర్లతో ఆ స్థలంలో పనులు కొనసాగించారని భూ యజమాని ఎడ్ల సుధాకర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు.. గత విచారణలో రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజా క్షమాపణలతో ఈ ఎపిసోడ్‌కు తెరపడింది.