calender_icon.png 25 August, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమాటల ‘చిన్నయ్య’

25-08-2025 01:19:02 AM

ధర్మస్థల కుట్రదారు కేసులో విస్తుపోయే నిజాలు

బెంగళూరు, ఆగస్టు 25: ధర్మస్థల సామూహిక ఖననం కేసులో మాట మార్చిన ముసుగు మనిషి చిన్నయ్య మామూలోడు కాదు. ఆయన పచ్చి అబద్ధాల కోరు అని బయటపడింది. చిన్నయ్య మాజీ భార్య రత్నమ్మ మాట్లాడుతూ.. ‘చిన్నయ్య ధర్మస్థలి విషయంలో చేసిన ఆరోపణలు తప్పని తేలింది. దీంతో సిట్ అధికారులు ఆతడిని అరెస్ట్ చేశారు. చిన్నయ్య తప్పుడు మనిషి. ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు.

చిన్నయ్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించా. విచారణ సమయంలో కూడా చిన్నయ్య అబద్ధాలతో కోర్టును తప్పుదోవ పట్టించాడు. దీంతో నాకు తీవ్ర అన్యాయం జరిగింది. చాలా రోజుల పాటు నా తల్లే నన్ను సాకింది. ఇప్పుడు బిడ్డల అండతో జీవిస్తున్నా’ అని పేర్కొంది. గ్రామస్తులు కూడా చిన్నయ్య గురించి కీలక విషయాలు చెబుతున్నారు. చిన్నయ్య నిత్య పెళ్లి కొడుకు అని ధర్మస్థలిలో ఉన్నపుడే అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు భార్యలకూ ఆయన విడాకులు ఇచ్చాడని పేర్కొంటున్నారు.

ఇక మొదట సామూహికంగా అనేక మందిని ఖననం చేశానని చెప్పిన చిన్నయ్య తర్వాత మాట మార్చాడు. తాను అబద్ధం చెప్పానని తనకు ఏమీ తెలియదని పేర్కొన్నాడు. కొంత మంది ఒక పుర్రెను ఇచ్చి అలా చెప్పమంటే చెప్పానన్నాడు. దీంతో సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముసుగు మనిషిగా అందరికీ సుపరిచితుడైన చిన్నయ్య పెద్ద అబద్ధాల కోరు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.