calender_icon.png 5 July, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ముద్దుబిడ్డ కమ్లా పెర్సాద్

05-07-2025 02:18:41 AM

  1. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానిపై మోదీ ప్రశంసల వర్షం
  2. ట్రినిడాడ్ వాసులకు భారత ఓవర్సీస్ సిటిజన్‌షిప్
  3. కమ్లాకు అయోధ్య రామమందిర నమూనా బహూకరణ
  4. మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 4: ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్ బిసెస్సార్‌ను  నరేంద్ర మోదీ ‘బీహార్ ముద్దబిడ్డగా అభివర్ణించారు. కమ్లా పూర్వీకులు బీహార్‌లోని బక్సర్‌కు చెందినవారని పేర్కొన్నారు. అక్కడి ప్రజలు కమ్లాను బీహార్ కుమార్తెగా భావిస్తారన్నారు. ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు.

బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనంతరం ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. శతాబ్దాలుగా వివిధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఇక కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో దాదాపు 40 శాతం మంది భారత సంతతికి చెందినవారే ఉన్నారన్నారు.

మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ వారి ఆహారం, సంగీతం, భాషల్లో స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. ట్రినిడాడ్‌లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయని తెలిపారు. భారత విదేశాంగ లెక్కల ప్రకారం ట్రినిడాడ్‌లో సుమారు 5.56 లక్షల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తుండటం గొప్పవిషయమన్నారు.

అందుకే ట్రినిడాడ్ వాసులకు భారత ఓవర్సీస్ సిటిజన్ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డును అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్డు ట్రినిడాడ్‌లోని ఆరోతరం ప్రవాస భారతీయులకు అందిస్తామని మోదీ స్పష్టం చేశారు. భారత్, ట్రినిడాడ్ మధ్య బంధం తరాలు, భౌగోళిక సరిహద్దులకు అతీతమైనదని పేర్కొన్నారు. ఒకప్పుడు లారా ఆటను ఆస్వాదించామని..

ఇప్పుడు సునీల్ నరైన్, నికోలస్ పూరన్ మన యువతలో అదే ఉత్సాహాన్ని నింపుతున్నారంటూ క్రికెట్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ స్వీకరించారు. అనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగో జాయింట్ పార్లమెంట్ ‘ఐకానిక్ రెడ్‌హౌస్’ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

మోదీకి అరుదైన గౌరవం..

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ మెడల్‌తో మోదీని సత్కరించారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్వీకరిస్తున్నందుకు ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. మన రెండు దేశాల మధ్య లోతైన స్నేహం, బలమైన సంబంధాలకు చిహ్నమని తెలిపారు.

కమ్లా నోట మోదీ కవిత

అంతకుముందు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్ విమానాశ్రయంలో మోదీకి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ట్రినిడాడ్ ప్రధాని నోట మోదీ రాసిన కవిత వినిపించింది. ‘ఆంఖ్ ఆ ధన్య ఛే’ పేరిట మోదీ రాసిన పుస్తకంలోని కవితను కమ్లా పెర్సాద్ చదివి వినిపించారు. 

ట్రినిడాడ్ ప్రధానికి పవిత్ర గంగాజలం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రినిడాడ్ వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌కు అయోధ్య రామ మందిర నమూనాతో పాటు పవిత్ర సరయూ నదీ జలాన్ని, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా తీర్థాన్ని కూడా అందించారు. ఈ బహుమతులు భారత్ మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింభిస్తాయని మోదీ పేర్కొన్నారు.

సోహరి ఆకుపై ప్రత్యేక భోజనం

కాగా ప్రధాని మోదీకి కమలా పెర్సాద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న ప్రజలు పవిత్రంగా భావించే సోహరి ఆకుపై ఆహారాన్ని వడ్డించారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఇలా ఆకుపై భోజనం చేయడం అక్కడి సంప్రదాయం. అనంతరం మోదీ భోజ్‌పురి చౌతాల్ సంగీత ప్రదర్శనను తిలకించారు. 

మహిళల ప్రాధాన్యత సంతోషకరం

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఐకానిక్ రెడ్ హౌస్‌లో మీలాంటి ప్రతినిధుల ముందు నిలబడటం నాకు చాలా గౌరవంగా ఉంది. భారత్ నుంచి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులను ఇక్కడికి తీసుకొచ్చాను. పార్లమెంట్ సభలో ఇంత మంది మహిళా సభ్యులను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ సంస్కృతిలో మహిళల పట్ల గౌరవం లోతుగా పాతుకుపోయింది.

అంతరిక్షం, క్రీడలు, స్టార్టప్స్, సైన్స్ రంగం, విమానయానం, సాయుధ దళాల వరకు భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదు. మీ పార్లమెంట్‌లో ఉన్న సభ్యుల పూర్వీకులు భారత్‌లోని బీహార్ నుంచి వచ్చారు. ఇది వైశాలీ వంటి కేంద్రాలకు ప్రసిద్ధి చెందింది.’ అని తెలిపారు.