calender_icon.png 5 July, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపరిష్కృతంగా పేమెంట్ ఆర్డర్ సమస్య

05-07-2025 02:20:08 AM

జీవితాంతం కష్టపడి సింగరేణి కార్మికులు పదవి విరమణ పొందిన తర్వాత, వారి ఆర్థిక భద్రత కల్పించేందుకు యాజమాన్యం   1998లో ‘కోల్ మైన్స్ పెన్షన్ స్కీం’ అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా విశ్రాంత సింగరేణీయులకు పెన్షన్ అందుతున్నది. ప్రస్తుతం సంస్థ పరిధిలో 82,000 మంది వరకు పెన్షన్ పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా యజామాన్యం ‘కోల్ మైన్స్ ప్రావిడెంట్’ ద్వారా సుమారు 80 కోట్లు చెల్లిస్తున్నది.

పెన్షన్ పొందుతున్న కార్మికుడు ఎవరైనా మరణిస్తే, నిబంధనల ప్రకారం.. అతడి భాగస్వామికి వితంతు పెన్షన్ గత పెన్షన్‌లో 60 శాతం వరకు అందించాల్సి ఉంటుంది. ఆ పెన్షన్ పొందడం ఇప్పుడు అంత సులువుగా లేదు. భర్తను కోల్పోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య వితంతు పెన్షన్ కోసం సీఎంపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. యాజమాన్యం గతంలో కార్మికుల సౌకర్యార్థం పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాను సర్వువర్, ఫార్మర్ మోడ్ లో మార్చుకోవాలని సూచించింది.

అనంతరం ఆ పత్రాలను గని అధికారులకు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఆ పిలుపు మేరకు ఎక్కడ నివాసం ఉంటున్న.. విశ్రాంత కార్మికులైనా ఆ ప్రక్రియ పూర్తి చేశారు. కార్మికులు సమర్పించిన దరఖాస్తులను సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపితే సవరించిన పెన్షన్ పేమెంట్  ఆర్డర్ జారీ చేయాలని సీఎంపీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నిర్ణయించింది. సవరించిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లో పెన్షన్ పొందుతున్న కార్మికుడి పేరు భార్య పేరు, అతను మరణించిన తర్వాత ఆమెకు లభించే పెన్షన్ వివరాలు పొందుపరచాల్సి ఉంది.

ప్రస్తుతం సింగరేణి పరిధిలో ఆ ప్రక్రియ నత నడకన సాగుతున్నది. గతంలోనైతే కార్మికుడు మరణిస్తే.. వెంటనే భార్య తన భర్త పెన్షన్ తీసుకునే బ్యాంక్‌లో కార్మికుని మరణ ధ్రువ పత్రం, ఆధార్ కార్డుతో పాటు ఇతర పత్రాలు సమర్పిస్తే సరిపోయేది. తర్వాత పెన్షన్ నోడల్ బ్యాంక్ ఎస్‌బీఐ (ధన్‌బాద్) బ్రాంచి ద్వారా సులువుగా పెన్షన్ పొందేలా ప్రక్రియ ఉండేది.

ఇప్పుడు ముందు సీఎంపీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగి, ఆ తర్వాత వారు సవరించిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేయాల్సి వస్తున్నది. ఆ ప్రక్రియ ఎంతో జాగవుతున్నది. ప్రతి ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉండాలని, సంస్థను కాగిత రహిత సంస్థగా తీర్చి దిద్దాలనే ఆశయం సంస్థకు ఉన్నప్పటికీ.. అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. 

సవరించిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేని వితంతువులు మళ్లీ పాత పద్ధతిలో గనులు, సీఎంనీఎఫ్ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నది. నెల రోజుల క్రితం ‘సి-డాక్’ అనే సంస్థ ‘సీ-కేర్’ మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కార్మికులు సులభంగా సీఎంపీఎఫ్ బ్యాలెన్స్, ఇతర వివరాలు తెలుసుకునే అవకాశం కలిగింది. అలాగే కార్మికుల మరణం తర్వాత, వారి కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేలా సంస్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధ ప్రాతిపదికన రిటైర్డ్ కార్మికులకు సవరించిన పెన్షన్ పే మెంట్ ఆర్దర్లు జారీ చేయాలి.        

ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్