05-07-2025 02:23:07 AM
ఆచార్య మసన చెన్నప్ప :
ఒకరోజు కసిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లాను. ‘రండి చెన్నప్ప గారూ’ అంటూ సోఫాను చూపెట్టి ఇంట్లోకి వెళ్లారు. కాసేపట్లో టీ పాయ్‌తో వచ్చి ‘టీ’ అందించారు. ఇంట్లో కసిరెడ్డిగారొక్కరే ఉండడం వల్ల వారే స్వయంగా వంట చేసుకునే వారని ఇందుమూలంగా అర్థమయింది. తన అర్ధాంగి కస్తూరి దీర్ఘకాలం నుంచి అస్వస్థురాలు కాగా.. ఆయనే స్వయంగా సేవలందించారు.
అట్లే తన మాతృమూర్తికి కూడా బాగుకాలం సేవలందించారు. విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండి ఈ సేవలందించడం ఒక్క కసిరెడ్డి గారికే సాధ్యమైందని చెప్పాలి. కసిరెడ్డి స్వస్థలం పోలేపల్లి. నా స్వస్థలం కొల్కలపల్లి. ఈ రెండు గ్రామాలు అమన్‌గల్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా)లో ఉన్నవి. నా వూరికి కొన్ని మైళ్ల దూరంలోనే వారి స్వగ్రామం ఉన్నా.. నేను వారి గురించి విన్నది, 1967 ప్రాంతంలోనే కసిరెడ్డి గారికి వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలతో సత్సంబంధాలున్నవి.
వారు హైదరాబాద్‌లోని శివానంద ఆశ్రమానికి చాలాకాలం కార్యదర్శిగా ఉండి గొప్ప సేవ చేశారు. ఆశ్రమ పక్షాన వెలువడే ‘శివానంద భారతి’కి సంపాదకుడిగా ఉండి ఆ పత్రికలో ఉపనిషత్తులపై వ్యాసాలు రాయించి ప్రచురించారు. వ్యాసాశ్రమంతో గల అనుబంధంతో నాకు ‘యథార్థ భారతి’లో ఉపనిషత్తుల మీద కొన్ని ఏండ్లుగా నాతో వ్యాసాలు రాయించి ప్రచురింపజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ‘ధర్మ ప్రచార పరిషత్తు’కు కార్యదర్శిగా నాతో ఉపన్యాసాలిప్పించారు. భక్తిజ్ఞాన వైరాగ్య సంపన్నులైన కసిరెడ్డిలో మనం ఒక యోగి పుంగవుణ్ణి చూడవచ్చు. ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల వారితో పాటు వెళ్లి ఆధ్యాత్మిక సాహిత్య ప్రసంగాలు చేసే అదృష్టం నాకు కలిగింది.
ఆదర్శంగా తీసుకున్నాం..
నేను 5వ తరగతి పాసై నల్లగొండ జిల్లాలోని చింతపల్లి ఉన్నత పాఠశాలలో చదవడానికి వెళ్లాను. నా తోటి విద్యార్థులు మాత్రం మా వూరికి సమీపంలో ఉన్న మాడ్గులలో చదవడానికి వెళ్లారు. అట్లా కసిరెడ్డి పేరు నాకు తెలిసింది. ఆయన పాలెం ప్రాచ్య కళాశాలలలో జిప్.ఓ.ఎల్ చదివి, విశ్వవిద్యాలయంలోనే ఫస్టు ర్యాంకు సంపాదించుకున్నారని, మేం కూడా ప్రాచ్య విద్యనభ్యసించి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని మా తెలుగు పండితుడు బాలకృష్ణ చెప్పినారు.
మా చింతపల్లి పాఠశాలలో మాకు గ్రామంలో తెలుగు చెప్పిన బాలకృష్ణ ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ‘విశారద’ పాసై వచ్చినవారు. తరచుగా ప్రాచ్యవిద్యను గూర్చి చెబుతూ ఉండేవారు. నేను విశారద (1970)లో ఉత్తీర్ణుడనై హైదరాబాద్, ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాలలో జిప్.ఓ.ఎల్‌లో చేరాను.
అప్రత్యక్షంగా కసిరెడ్డి నాకు ఆదర్శమని చెప్పుకోవాలి. అప్పటివరకు పరిషత్‌లో గాని, ఇతరత్రా గాని.. జరిగే సాహిత్య కార్యక్రమాల్లో కసిరెడ్డిని చూసినంత వరకే గానీ, వారితో సన్నిహిత సంబంధం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాతనే జరిగింది.
ప్రాచ్యవిద్య ప్రాణప్రదం..
ఒకే జిల్లా, ఒకే మండలం, సమీప గ్రామస్తులమైన మాకు ప్రాచ్యవిద్య ప్రాణప్రదమైంది. కసిరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 1985లో చేరారు. నేను వారు చేరిన నాలుగేండ్లకు లెక్చరర్‌గా ప్రవేశించాను. 1989 నుంచి 2006 వరకు.. మొత్తం 26 ఏండ్లలో 18 ఏండ్లు వారితో కలిసి పనిచేశాను. పని చేసిన కాలమంతా వారితో నాకు గల సాహిత్య సంబంధం నాకెంతో తృప్తినిచ్చింది.
వారు ప్రాచ్య విద్యలో పట్టభద్రుడు. నేనూ ప్రాచ్యవిద్యలో అనుభవం గడించినవాణ్ణి. మాకు తోడుగా విశ్వవిద్యాలయంలో ఆచార్య యెల్దిండ రఘుమన్న గారుండేవారు. ‘మేం ముగ్గురం ఒకే మాట.. ఒకే బాట’ అన్నట్లు సాగినవాళ్లం. మాకు ముదిగొండ శివప్రసాద్, రాజన్నశాస్త్రి సహకరించే వారు.
కసిరెడ్డిని ఆదర్శంగా తీసుకోవడం వల్ల నాలో జాతీయ భావాలు అంకురించాయి. సహజంగా నేను దైవభక్తి కలిగినవాణ్ణి. కసిరెడ్డి దానికి దేశ భక్తిని జతపరిచారు. దేశభక్తిపై ముదిగొండ శివప్రసాద్, రఘుమన్న ఎన్నో రచనలు చేశారు. ఇక కసిరెడ్డి విషయంలో చెప్పాలంటే వారి రచనలన్నీ దేశభక్తిపూరితాలే. జాతీయ భావోద్దీపకాలే. దైవభక్తి సంభరితాలే.
వ్యవసాయం చేసిన శ్రామికుడు..
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కసిరెడ్డి స్వయంగా నాగలి పట్టి వ్యవసాయం చేశాడు. కాని, నేను చేనేత కుటుంబంలో జన్మించినప్పటికీ ‘నాడె’ (బట్టలు నేయడానికి ఉపయోగపడే సాధనం) పట్టలేదు. కానీ వారిని ఆదర్శంగా తీసుకుని కవిత్వం రాశాను. వక్తనయ్యాను. పరిశోధకుణ్ణి అయ్యాను. ఆచార్యుణ్ణి అయ్యాను. పద్యగేయ రచనల్లో కసిరెడ్డి గొప్ప నేర్పు ప్రదర్శించారు. కవిగానే కాకుండా వక్తగా దేశమంతటా కీర్తిగడించారు.
వారు శిరసెత్తి వీక్షిస్తే శీతాద్రిని తలపిస్తారు. గళమెత్తితే గంగాఝరి అనిపిస్తారు. కసిరెడ్డి సాధారణంగా శ్వేతవస్త్రధారి. వారి స్వభావం సత్తగుణ ప్రధానమైంది. అధర్మాన్ని ఖండించే సందర్భంలో మాత్రం వారి మాటలు ఈటెలవుతాయి. వారు సభల్లో మాట్లాడితే.. కసిరెడ్డి గారే మాట్లాడాలనిపిస్తుంది. కసిరెడ్డి వందలు, వేల సభల్లో పాల్గొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికలను పంచుకున్నారు. ఎక్కడికి వెళ్లి ఎలాంటి ప్రసంగం చేసినా దానిని ప్రేక్షకలోకం హర్షించకుండా ఉండదు. సభానంతరం వారి ఉపన్యాసానికి స్పందించిన వాళ్లు, స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పగలరంటే వారెంతటి వ్యక్తిత్వం, సాహిత్య సంపద గల వారో అర్థమవుతుంది.
వారు వందలాది సెమినార్లలో పాల్గొన్నారు. వారికి జానపద సంగీతం అభీష్టమైనప్పటికీ వారి నోటి వెంట రామాయణ, భారత, భాగవత కథలే గాక, అష్టాదశ పురాణాల్లోని కథలు నర్తనం చేస్తాయి. వారికి సనాతన ధర్మం అంటే ఎంతో ప్రేమ. భగవద్గీత అంటే ప్రాణం. ‘సీత’ను గూర్చి ప్రసంగించేటపుడు వారు కృష్ణులవుతారు.
ప్రేక్షకులు పార్థులవుతారు. వారి జ్ఞాపకశక్తి గొప్పది. వారికి గల ధారణశక్తి ఇతరుల్లో కనిపించదు. ఐతే వారికి ఎప్పుడైనా చేయబోయే ప్రసంగానికి ముందు దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. ప్రత్యేకంగా ప్రసంగించడానికి ఆ అంశానికి సంబంధించిన విషయాలను నోట్స్ రూపంలో రాసుకుంటారు. నేను వారిని చూసే ప్రసంగ పాఠాన్ని ముందుగా తయారుచేసుకోవడం నేర్చుకున్నాను.
పద్యంతోనో, గేయంతోనో, సామెతతోనో లేదా ఒక పొడుపుకథతోనో ప్రసంగం ఆరంభించి అదే స్థాయిలో కొనసాగించి అద్భుతంగా ముగించడం వారికి వక్తృత్వంలోని విశేషం. మేము ఎంత ప్రయత్నించినా వారి వక్తృత్వ శైలిని అందుకోలేకపోయాం. వారి వలె ప్రసంగించలేకపోయాం. వారు నిస్వార్థజీవనులు. సమాజాభివృద్ధి వారి ఏకైక లక్ష్యం. సంస్కృతిపరంగా, చరిత్రపరంగా మన దేశం ఎంతోగొప్పది.
దాని ఔన్నత్యాన్ని కవులు, కళాకారులు, కాపాడాలని వారు ఆకాంక్షిస్తారు. అందుకుగాను వారు వందలమంది విద్యార్థులను ఉభయ రాష్ట్రాల్లో జాతీయవాదులుగా తీర్చిదిద్దినారు. ఎవరేసమయంలో ఏమడిగినా కానీ చక్కగా సమాధానం ఇచ్చే సామర్థ్యం బహుశా తెలుగుశాఖలో ఒక్క వారికే ఉందంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వారి ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులు మంచి పరిశోధకులయ్యారు.
విద్యార్థులను తనతో సమానులుగా చూసే సహృదయత్వం వారిది. నాకు వారితో కలిసి పని చేయడం వల్ల కలిగిన ప్రయోజనం లెస్స. వారు నన్ను ఎన్ని సభలకు తోడుగా తీసుకుని వెళ్లారో చెప్పలేను. వారిది జాతీయ సాహిత్య పరిషత్తు. నాది ఉపనిషత్తు. ఇద్దరం వేదికలను పంచుకునే వాళ్లం. కలిసి కారులో ప్రయాణించేవాళ్లం. ఇప్పటికీ ప్రయాణిస్తున్న వాళ్లం. ఒకరికొకరం సమీపంలో నివసిస్తున్నవాళ్లం.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య రఘుమన్న కవిరాజ సూయాన్ని తలపెట్టినపుడు కసిరెడ్డితో పాటు నేనూ వెన్నుదన్నుగా ఉన్నాను. సనాతన సంస్కృతికి పెట్టనికోట కసిరెడ్డి. ఆయన కన్నా విజ్ఞానం గొప్పది. సహనశక్తి అంత కంటే గొప్పది. ఈర్షాద్వేషాలెరుగని సౌజన్యమూర్తి కసిరెడ్డి. అందరిలో పరమాత్మను దర్శించే వ్యక్తికి తారతమ్యాలుండవు. కసిరెడ్డి హృదయం నిర్మలమైంది. నిసర్గరమణీయమైనది.
వ్యాసకర్త సెల్: 9885654381