05-07-2025 02:21:04 AM
‘కొత్త దలైలామా స్వేచ్ఛా ప్రపంచంలో పుట్టినవాడై వుంటాడు..’ భారత్‌లోని ధర్మశాలలో ప్రవాసజీవితం గడుపుతున్న 14వ దలైలామా చెప్పిన మాటలివి. 90వ జన్మదినం జరుపుకోనున్న 14వ దలైలామా, టెన్జిన్ గ్యాట్సో కొత్త దలైలామా ఎంపిక ప్రక్రియకు తలూపేనా, లేక టిబెట్ బౌద్ధులు ఆరాధ్య దైవంగా కొలిచే దలైలామా వ్యవస్థ ఆగిపోనున్నదా అన్న సందేహాలు తొలగిపోయాయి.
తన మరణానంతరం కొత్త దలైలామా ఎంపికను బౌద్ధ సన్యాసులు నిర్వహిస్తారని, ఇందులో ఏ ప్రభుత్వాలకు, ఏ రాజకీయ హస్తాలకు తావులేదని ప్రస్తుత దలైలామా ప్రకటించారు. ‘స్వేచ్ఛా ప్రపంచంలో ’ అని దలైలామా అన్న పదాలు చైనాను కలవరపెడుతున్నాయి. ౬౦౦ ఏళ్ల క్రితం టిబెట్ బౌద్ధులు ఏర్పర్చుకున్న దలైలామా వ్యవస్థ కమ్యూనిస్టు చైనాకు కంటగింపుగానే వుంది.
బౌద్ధుల సంప్రదాయాల పరంపర కొనసాగితే, మతం.. సంస్కృతి పేర టిబెట్ ఎన్నటికీ తమ మాట ఖాతరు చేయదని చైనా పాలకులు భావించారు. లాసా పర్వతాలెప్పుడు బీజింగ్ అధికార కారిడార్లను కలవరపెడుతూనే వుంటాయి. కొత్త దలైలామాను పునర్జన్మ విధానంలో చైనా నుంచే ఎంపిక చేస్తే ఎలా? అందుకే ప్రస్తుత దలైలామా, తను ఏర్పాటు చేసిన బౌద్ధభిక్షుల ట్రస్ట్ తన వారసుడిని ఎంపిక చేస్తుందని ప్రకటించడం చైనాను మరోసారి కలవరపరిచింది.
చైనాలో 18వ శతాబ్దంలో క్వింగ్ రాజులు ఏర్పర్చిన ‘బంగారు కలశం’ విధానంలోనే 15వ దలైలామా ఎంపిక జరగాలని చైనా ఖరాఖండిగా చెపుతున్నది. కొన్ని పేర్లున్న చిట్టీలు ఓ బంగారు కలశంలో వేసి, లాటరీ తీయడంతో కొత్త దలైలామా ఎంపిక జరుగుతుంది. ఈ పద్ధతిలో టిబెటన్ బౌద్ధుల మత విశ్యాసాలకు స్థానం లేదనేది ప్రస్తుత దలైలామా వాదన. టిబెట్ బౌద్ధుల ఆచారం ప్రకారం, దలైలామా మరణానంతరం కొత్త దలైలామా ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.
దలైలామా అంత్యక్రియల్లో పొగ ఏ దిక్కున పారుతున్నది, మరణించినపుడు దలైలామా కళ్లు ఏ దిక్కున చూస్తున్నాయనే.. దానిని బట్టి అ దిశగా, ఏ దేశంలోనై నా ఏ కొత్త దలైలామా కోసం వెతుకులాట సాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గొ ప్ప గౌరవ మర్యాదలు చూరగొంటున్న దలైలామా వ్యవస్థనే తుడిచిపెట్టి, టి బెట్ భూభాగంపై బౌద్ధ మత గురువుల ప్రభావం లేకుండా చూడాలనేది చైనా పాలకుల లక్ష్యం.
14వ దలైలామా వ్యక్తిత్వం, ఆయన ఆధ్యాత్మిక భావనలు అంతర్జాతీయంగా మన్ననలు పొందడం, ఆయనకు నోబెల్ బహుమతి కూడా రావడం బీజింగ్‌కు గిట్టని విషయాలు. పంచన్ లామా పునర్జన్మగా 1995లో దలైలామా, టిబెట్‌లోని ఓ బాలుణ్ని ఎంపిక చేశారు. చైనా అధికారులు ఆ బాలుణ్ని ఎత్తుకెళ్లారు. ఆ పిల్లవాడి కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ ఎవరికి తెలియదు. అంతేకాదు, కొత్త పంచన్‌లామా ఇతడేనంటూ చైనా తమ అభ్యర్థిని ప్రకటించింది.
అతను ‘పంజరంలో ఓ పక్షి’ అంటూ ప్రధాన బౌద్ధులు తిరస్కరించారు. టిబెట్ బౌద్ధులను తమ చేతిలోనే పెట్టుకోవాలని చైనా అప్పుడు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అయినా 15వ దలైలామా ఎంపిక టిబెట్ బుద్ధిజం చరిత్రలో ఎన్నడూ లేనట్టు, ఇద్దరు దలైలామాలు పుట్టుకురావొచ్చు.
తదుపరి దలైలామాను ఎంపిక చేసుకోవడంలో టిబెట్ బౌద్ధులకు పూర్తి స్వేచ్ఛ వుందని, ఇందులో మరొకరి జోక్యం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. చైనాపై 1959లో టిబెట్ తిరుగుబాటు విఫలం కావడంతో ఇప్పటి దలైలామా భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటినుంచి దలైలామాకు భారత్ మద్దతునిస్తున్నది.