11-10-2025 07:06:28 PM
కాటారం,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన నిర్వహించి, బీసీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరమా..? అని బిజెపి బిఆర్ఎస్ పార్టీలను మహేందర్ గౌడ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై ఇప్పటిదాకా గవర్నర్ సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తే..విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయని, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్ప బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ బిజెపి నేతలు మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పదేపదే బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించారాని, బిజెపి నేతలు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఉంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వారనీ, ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ అనడం సిగ్గుచేటన్నారు.
బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నదెవరో..బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన నిర్వహించి..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటే..బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కడుపు మండుతోందని, ఇకనైనా బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆపి బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు.