11-10-2025 07:07:06 PM
ఎక్సైజ్ సిబ్బందికి గాయాలు..
నారాయణఖేడ్ పరిధిలోని చల్లగిద్ద తండాలో ఘటన..
నారాయణఖేడ్: గంజాయి రైట్స్ కు వెళ్లిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై స్థానిక తండావాసులు దాడి చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని చల్లగిద్ద తాండాలో శనివారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మదగ్గ సమాచారంతో చల్లగిద్ద తాండ శివారులో పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న నమ్మదగ్గ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. తాండకు చెందిన జానకిరాం పత్తి చేనులో సాగు చేస్తున్న 64 గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం తండాలో ఎండు గంజాయి ఉందేమో అనే అనుమానంతో టాస్క్ ఫోర్స్ అధికారులు పలు ఇళ్లల్లో తనిఖీలు చేపట్టగా వడిత మోహన్ ఇంట్లో నాలుగు కిలోల ఎండు గంజాయి, కిలోన్నర గంజాయి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా స్థానిక తాండవాసులు పోలీసు సిబ్బందిని అడ్డుకొని వారి మొబైల్ ఫోన్లను లాక్కొని ఎక్సైజ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఎక్సైజ్ అధికారులు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డికి సమాచారం ఇవ్వగా సిర్గాపూర్ పోలీసులను అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి పంపారు. వారితో పాటు కంగ్టి సీఐ వెంకటరెడ్డి, నారాయణఖేడ్ ఎస్సై శ్రీశైలంలు వెళ్లి తాండాలో ప్రత్యేక పికెటింగ్ నిర్వహించారు. దీంతో తాండాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ శంకర్, టాస్క్ ఫోర్స్ ఎస్సై హనుమంతు, అరుణ జ్యోతిలకు గాయాలు అయ్యాయి. ఖేడ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ టాక్స్ ఫోర్స్ అధికారులు దాడికి పాల్పడిన జానకిరాం, వడితే మోహన్ ల పై కేసు నమోదు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.