11-10-2025 07:03:27 PM
పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతూ దొడ్డిదారిన అధికారంలోకి వస్తుందని, ఓటు చోరీపై ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శనివారం ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై పూర్తి ఆధారాలతో వివరాలు బయటపెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను తొలగించడమే కాకుండా బీజేపీకి అనుకూలంగా ఉన్న చోట నూతన ఓటర్లను చేరుస్తూ ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టారని కోరారు. అంతేకాకుండా ఈవీఎం మిషన్లు రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాలు చేసిన పత్రాలు మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.