18-10-2025 08:44:39 PM
బీసీల జస్టిస్ బంద్‌కు బిజెపి సంపూర్ణ మద్దతు..
డా. వెన్న ఈశ్వరప్ప..
శంకర్‌పల్లి: బీసీలకు న్యాయం జరగాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఫర్ జస్టిస్ లో భాగంగా శంకర్‌పల్లి మండల మోకిల గ్రామంలో బంద్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వెన్నఈశ్వరప్ప నిరసన తెలియజేశారు. డా. వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ బీసీలు పోరాడుతున్నది, కేవలం రిజర్వేషన్ల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి, రిజర్వేషన్లు ఇస్తామని, కొన్ని శక్తుల ద్వారా కోర్టుకు వెళ్లి, బీసీల హక్కులను కాలరాశారు.
కోర్టు స్టే తీసుకురావడం అనేది బీసీల భవిష్యత్తును అంధకారం చేయడమే. ఇది సామాజిక న్యాయానికి విఘాతం. బీసీల రిజర్వేషన్ పై స్టే వచ్చినప్పుడు, దీనిని నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యమైంది? ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధి చూపాలి. లేదంటే, ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షురాలు లీలావతి బయ్యనంద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు గౌడ్, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ కన్నా, చేవెళ్ళ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటయ్య, బీర్ల నర్సింహ, యాదయ్య, రాజాచంద్ర, కృష్ణ, షణ్ముఖేష్, రాజేష్, కరుణాకర్, వెంకటేష్, సంతోష్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.