calender_icon.png 22 December, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పల్లెల్లో పాతుకుపోయింది

22-12-2025 12:00:00 AM

- సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం

- ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట, డిసెంబర్ 21(విజయక్రాంతి): కష్టపడిన కార్యకర్తలకు గెలుపు దక్కిందనీ, డబ్బుతో కాదు, నిజాయితీతోనే ప్రజల మద్దతుతో బీజేపీ కార్యకర్తలు గెలిచారని బిజెపి నేత మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా గెలిచిన బిజెపి కార్యకర్తలకు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఇక పట్నాలకే పరిమితం కాదని, పల్లెల్లోనూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుందని స్పష్టం చేశారు. తాజాగా జరిగిన సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఆటోల్లో తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, రోడ్ల మీద కష్టపడిన కార్యకర్తలే ఈరోజు స్టేజీ మీద కూర్చున్నారని ఆయన గుర్తు చేశారు. డబ్బులు పంచి గెలిచిన వారు కాదు, ఊర్లో ఉండి సేవ చేసిన వాళ్లనే ప్రజలు గెలిపించారని స్పష్టం చేశారు. బీజేపీ సర్పంచ్ల విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు రావాల్సిన నిధులను ఆపేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందిస్తోందని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 99.9 శాతం డబ్బులు ప్రజల ఖాతాల్లోకే చేరుతున్నాయని చెప్పారు. రాష్ట్రం ఏమిచ్చింది, కేంద్రం ఏమిచ్చిందో ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు చెప్పండి అని సర్పంచ్లకు సూచించారు.బీజేపీ సర్పంచ్లు మిగతావారిలా కాకుండా ఆదర్శంగా పనిచేయాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గ్రామాల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు.

ఒకటి, రెండు సార్లు కాదు& ఎన్నిసార్లు అవకాశం వచ్చినా ప్రజల కోసం పనిచేసే నాయకులుగా ఎదగాలని సూచించారు. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ బిల్లుతో గ్రామ స్థాయి నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి భవిష్యత్తు ఉందనీ, తెలంగాణలో కూడా రేపటి పాలన మనదే అని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు. వివిధ పార్టీలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడం హేయమైన చర్య అంటూ మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పై పరోక్షంగా విమర్శలు చేశారు. మీలాంటి దిగజారుడుతనం మేము చేయలేమని అలా నాయకులను కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవాల్సి వస్తే మీ దగ్గర ఒక్క కార్యకర్త కూడా మిగలడంటూ విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, నాయకులు రామచంద్రారెడ్డి, విభీషణ్ రెడ్డి, సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.