12-05-2025 02:30:27 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా తెలంగాణలో కులగణనలో భాగంగా బీసీ కుల సర్వే చేపట్టామని, 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ చేసిన చట్టాన్ని రాష్ట్రపతి ద్వారా ఆమోదించేలా చేయాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకులదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కులగణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయగానే అక్కడ ప్రభుత్వాలను కూల్చిన చర్రిత బీజేపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు కులగణన మీద అనుమానాలుంటే నివృత్తి చేస్తామని స్పష్టంచేశారు. ఎంతో మంది మేధావులు కులగణన చేసినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే, బీజేపీ నాయకులు మాత్రం కాళ్లలో కట్టెపెట్టి అడ్డుకొనే ప్రయ త్నం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ అధ్యక్ష, శాసనసభ, శాసన మండలిలో సభాపక్ష నాయకుడి పదవులకు బీసీలు పనికిరారా అని ప్రశ్నించారు. అన్ని అత్యున్నత పదవులు వేరే సామాజికవర్గానికి కేటాయించి, బీసీలపై మొసలికన్నీరు కారిస్తే సమాజం అంగీకరిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లును ఆమోదించేలా చేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు. కులగణన చేసి బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచేలా చట్టం చేయడం ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మాడల్‌గా మారిందని స్పష్టం చేశారు. తెలంగాణను చూసే, తప్పని పరిస్థితుల్లో కేంద్రం జనగణనతోపాటు కులగణన చేస్తామని ప్రకటించిందని తెలిపారు.