17-05-2025 01:21:15 AM
విపక్ష ఇండియా కూటమి భవిష్యత్తుపై అనుమానాలు
రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకుల వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ, మే 16: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని విధాలుగా బలంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కొనియాడారు. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమి భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో శుక్ర వారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ‘ఇండి యా కూటమి చెక్కుచెదరకుండా ఉంటే చాలా సంతోషం.
కానీ అది బలహీనంగా కనిపిస్తోంది. పుంజుకునేందుకు ఇంకా సమయం ఉంది. అదే బీజేపీ విషయానికొస్తే.. వ్యవస్థీకృతంగా బలంగా ఉంది. నా అనుభవం, చరిత్ర చూస్తే.. ప్రతి విభాగంలోనూ బీజేపీ అంత పటిష్టంగా మరేపార్టీ లేదు. ప్రతి వ్యవస్థను నియంత్రించగల, స్వాధీనం చేసుకోగల శక్తి ఆ పార్టీ సొంతం. కమలం పార్టీని ఎదుర్కోవాలంటే, విపక్ష కూటమి అన్ని విభాగాలను మెరుగుపరచుకోవాలి.
ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికలు అత్యంత కీలకం’ అని చిదంబరం పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. వరుస ఓటములు కాంగ్రెస్‌ను బాధించాయని ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. ‘చిదంబరం అంచనా ప్రకారం.. విపక్ష కూటమిలో అనిశ్చితి నెలకొంది.
బీజేపీ బలమైన పార్టీ, కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులకు కూడా తెలుసు’ అని మరో నేత ప్రదీప్ బండారీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో తన కొడుకును కాపాడుకునేందుకు, బీజేపీ మెప్పు పొందేందుకు చిదంబరం ఇలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌వర్గాలు చర్చించుకుంటున్నాయి.